జాగ్రత్తగా ట్రేడింగ్‌..!

ఈ వారంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ నిర్ణయాల కోసం వారు వేచిచూస్తుండడం ఇందుకు నేపథ్యం. 17న వెలువడే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ నిర్ణయాలూ  కీలకమే. నేడు

Updated : 14 Mar 2022 03:19 IST

 యూఎస్‌ ఫెడ్‌ సమావేశంపై దృష్టి బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ నిర్ణయంపైనా

 రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలూ కీలకమే

  ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీలకు సానుకూలతలు 

 విశ్లేషకుల అంచనాలు

ఈ వారంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ నిర్ణయాల కోసం వారు వేచిచూస్తుండడం ఇందుకు నేపథ్యం. 17న వెలువడే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ నిర్ణయాలూ  కీలకమే. నేడు వెలువడే ఫిబ్రవరి నెల దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా సెంటిమెంటుపై ప్రభావం చూపవచ్చు. నిఫ్టీకి 16,700-16,800 వద్ద నిరోధం ఎదురుకావొచ్చని; 16,400 వద్ద మద్దతు లభించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. డివిడెండు చెల్లింపులను పరిశీలించడానికి బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో టీవీఎస్‌ మోటార్‌, భెల్‌పైనా దృష్టి సారించవచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* సిమెంటు కంపెనీల షేర్లు సానుకూలంగా చలించవచ్చు. కొన్ని షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తుండడం ఇందుకు నేపథ్యం. అంచనాల కంటే తక్కువ గిరాకీ, బలహీన ధరల అంచనాల కారణంగా గత కొద్ది వారాలుగా ఇవి తగ్గుతూ వచ్చాయి. అయితే గత వారం కొంత రికవరీ కనిపించింది.

*ఈ వారం విడుదలయ్యే జనవరి నెల మొబైల్‌ వినియోగదార్ల సంఖ్య నుంచి టెలికాం షేర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. భారతీ ఎయిర్‌టెల్‌పై స్వల్ప-మధ్య కాలానికి విశ్లేషకులు ‘బులిష్‌’గా ఉన్నారు.

* వాహన కంపెనీల షేర్లు పరిమిత శ్రేణిలో కదలాడవచ్చు. అంతర్జాతీయ వాహన సరఫరా వ్యవస్థ అంతరాయాల ప్రభావాన్ని కంపెనీలు మదింపు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన షేర్లలో ట్రేడింగ్‌ కనిపించొచ్చు.

* రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో మదుపర్లు రక్షణాత్మక రంగాల వైపు వెళ్లవచ్చన్న అంచనాల మధ్య ఫార్మా షేర్లు రాణించవచ్చు.  

* దేశీయంగా ఎటువంటి వార్తలూ లేకపోవడం; యుద్ధంపై స్పష్టత లేకపోవడం వల్ల యంత్ర పరికరాల షేర్లు కీలక సూచీలకు అనుగుణంగా చలించొచ్చు. కొత్త ఆర్డర్ల వార్తల ఆధారంగా మౌలిక కంపెనీల షేర్లు కదలాడవచ్చు.

* లోహ, గనుల కంపెనీలు స్వల్పకాలానికి సానుకూలంగా ఉండొచ్చు. అంతర్జాతీయంగా ప్రాథమిక లోహ ధరలు పెరుగుతుండటం ఇందుకు దోహదం చేయవచ్చు. జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, టాటా స్టీల్‌లపై విశ్లేషకులు సానుకూలంగా ఉన్నారు.

*అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లు ట్రేడవవచ్చు. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం కోత ప్రకటిస్తే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లపై ప్రభావం పడవచ్చు.

*యుద్ధం కారణంగా ఇటీవల ఎఫ్‌ఐఐలు విక్రయాలు చేపట్టిన నేపథ్యంలో నాణ్యమైన బ్యాంకింగ్‌ షేర్ల వైపు మదుపర్లు మొగ్గుచూపవచ్చు. దిద్దుబాటు వల్ల ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఫెడరల్‌ బ్యాంకులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.  

* ఐటీ షేర్లు లాభాలను కొనసాగించవచ్చు. ప్రస్తుత ఊగిసలాటల మధ్య రక్షణాత్మక రంగాల వైపు మదుపర్లు మళ్లుతుండడం ఇందుకు కారణంగా నిలవవచ్చు. అయితే యూఎస్‌ఫెడ్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు చేపడితే ఐటీ రంగానికి కాస్త ఇబ్బంది ఎదురుకావచ్చు.

* ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్ల కంపెనీలు మార్కెట్‌నే అనుసరించవచ్చు. గోధుమలు, వంటనూనెల ధరల ద్రవ్యోల్బణం ప్రభావం ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల లాభదాయకతపై ప్రభావం చూపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని