తగ్గే అవకాశమే లేదు..

ఈ ఏడాదిలో సిమెంటుకు గిరాకీ అధికంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సిమెంటు అమ్మకాల్లో కనీసం 7 శాతం వృద్ధి అయినా నమోదవుతుందని అగ్రశ్రేణి సంస్థ అంబుజా

Published : 09 Apr 2022 03:57 IST

సిమెంటుకు అధిక గిరాకీ

కనీసం 7 శాతం వృద్ధికి అవకాశం

సామర్థ్యాన్ని విస్తరిస్తున్న అంబుజా సిమెంట్స్‌

దిల్లీ: ఈ ఏడాదిలో సిమెంటుకు గిరాకీ అధికంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సిమెంటు అమ్మకాల్లో కనీసం 7 శాతం వృద్ధి అయినా నమోదవుతుందని అగ్రశ్రేణి సంస్థ అంబుజా సిమెంట్స్‌ అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్లుగా ఉత్పత్తి, విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రధానంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పెద్దఎత్తున మొదలు కావటం, గృహ నిర్మాణ రంగం నుంచి గిరాకీ, గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాల్లో వృద్ధి, పారిశ్రామిక రంగంలో ఆకర్షణీయంగా మారటం... వంటి పలు కారణాలను పరిశ్రమ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. అన్ని వైపుల నుంచి సిమెంటుకు గిరాకీ కనిపిస్తోందని, అందువల్ల గత ఏడాదితో పోల్చితే అమ్మకాలు పెరిగే అవకాశమే కనిపిస్తోందని పేర్కొంటున్నాయి.

పీఎంఏవై పథకానికి (ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన) కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.48,000 కోట్లు కేటాయించిన విషయం విదితమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యాన్ని సైతం నిర్దేశించుకున్నారు. దీనికి తోడు ప్రైవేటు గృహ నిర్మాణం కూడా జోరుగా సాగుతోంది. కొవిడ్‌ మహమ్మారి ముందు నాటికి గృహ నిర్మాణ కార్యకలాపాలు చేరుకుంటున్నట్లు సంబంధిత వర్గాల కథనం. నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ) కింద కేంద్ర ప్రభుత్వం రూ.111 లక్షల కోట్లు వెచ్చించాలని అనుకుంటోంది. ఇందులో 80 శాతం నిధులను రోడ్లు, ఇంధన ప్రాజెక్టులు, మెట్రో రైళ్లు, నీటి పారుదల ప్రాజెక్టులకు కేటాయిస్తారు. అంతేగాక ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద కొత్త రోడ్లు నిర్మించాలని, దాదాపు 25,000 కిలోమీటర్ల జాతీయ రహదార్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇ-కామర్స్‌ వ్యాపార విభాగంలో జోరు హెచ్చినట్లు, దీనివల్ల గోదాముల అవసరాలు పెరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ సిమెంటు పరిశ్రమకు అనుకూలమని అంటున్నారు.

దేశంలో తలసరి సిమెంటు వినియోగం పెరిగేందుకు ఎంతగానో అవకాశం ఉన్నట్లు అంబుజా సిమెంట్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ఎస్‌ శేఖ్సరియా పేర్కొన్నారు. దీనికి తగినట్లుగా తాము సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. విస్తరణలో భాగంగా అంబుజా సిమెంట్స్‌ తన గ్రైడిండ్‌ సామర్థ్యాన్ని 7 మిలియన్‌ టన్నులకు పెంచుతోంది. బీహార్‌లోని బర్హ్‌లో కొత్త యూనిట్‌ కూడా స్థాపిస్తోంది. దీనివల్ల త్వరలో 50 మిలియన్‌ టన్నుల సిమెంటు ఉత్పత్తి సామర్థ్యానికి చేరువైనట్లు అవుతుంది- అని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ సంస్థకు 31.45 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మరోపక్క దేశంలోని కొత్త ప్రాంతాలకు తమ మార్కెటింగ్‌- పంపిణీ విభాగాలను విస్తరిస్తున్నట్లు, తద్వారా అమ్మకాలు పెంచుకునే అవకాశం కలుగుతుందని వెల్లడించారు.  మనదేశంలో సిమెంటు పరిశ్రమకు ప్రస్తుతం 545 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇందులో 10 శాతం వాటాకు దగ్గరగా అంబుజా సిమెంట్స్‌ ఉండటం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా సిమెంటు అధికోత్పత్తిని నమోదు చేస్తున్న దేశాల్లో మనదేశం రెండో స్థానంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని