32 సంస్థలకు రూ.38.75 కోట్ల జరిమానా

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌హెచ్‌ఎల్‌) నిధుల మళ్లింపు, మోసాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన కేసు వ్యవహారంలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ హోల్డింగ్స్‌ సహా 32 సంస్థలపై రూ.38.75 కోట్ల జరిమానాను

Published : 20 May 2022 02:48 IST

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కేసులో విధించిన సెబీ

దిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌హెచ్‌ఎల్‌) నిధుల మళ్లింపు, మోసాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన కేసు వ్యవహారంలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ హోల్డింగ్స్‌ సహా 32 సంస్థలపై రూ.38.75 కోట్ల జరిమానాను సెబీ విధించింది. 2018 నాటి ఈ కేసులో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ నుంచి భారీగా నిధులను అప్పటి ప్రమోటర్లు మళ్ళించారన్నది ఆరోపణ. నిధుల లెక్క తేలనంత వరకు కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలపై సంతకాలు చేసేందుకు ఎఫ్‌హెచ్‌ఎల్‌ ఆడిటర్‌ డెలాయిట్‌ హస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ ఎల్‌ఎల్‌పీ నిరాకరించింది. ఆ తర్వాత సెబీ దర్యాప్తు నిర్వహించింది. మూడు రుణ గ్రహీత కంపెనీలు- బెస్ట్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఫెర్న్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మోడ్‌లాండ్‌ వేర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు 2011-12 నుంచి 2017-18 వరకు ఇంటర్‌- కార్పొరేట్‌ డిపాజిట్లను (ఐసీడీ) లేదా స్వల్ప కాలిక రుణాలు మంజూరు చేసిన వ్యవహారంలో సెబీ దర్యాప్తు నిర్వహించింది. ఎఫ్‌హెచ్‌ఎల్‌ మాజీ ప్రమోటర్ల ప్రత్యక్ష నియంత్రణలో, పరోక్ష యాజమాన్యంలోని సంస్థ ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్‌ ప్రయోజనార్థం వివిధ మధ్యవర్తిత్వ సంస్థల నుంచి స్వల్పకాలిక రుణాల రూపంలో ఎఫ్‌హెచ్‌ఎల్‌ నిధులను పెట్టుబడుల రూపంలో మళ్లించారని సెబీ తన దర్యాప్తులో గుర్తించింది. మే 17న జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఎఫ్‌హెచ్‌ఎల్‌ నుంచి ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్‌కు, ఫోర్టిస్‌ హాస్పిటల్స్‌ నిధులు రూ.397 కోట్లను మళ్లించారు. మొదటి విడతలో స్వల్పకాలిక రుణాల కింద బెస్ట్, ఫెర్న్‌ లేదా మోడ్‌లాండ్‌లోని ఏదేని సంస్థ ద్వారా ఈ నిధులను మళ్లించారు. 2012 డిసెంబరు నుంచి 2016 మార్చి మధ్య బెస్ట్, ఫెర్న్, మోడ్‌లాండ్‌కు పలు స్వల్పకాలిక రుణాలను ఫోర్టిస్‌ హాస్పిటల్స్‌ ఇచ్చింది. ఆ తర్వాత ఈ నిధులను ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్‌కు వివిధ సంస్థల ద్వారా బదిలీ చేశారని సెబీ తెలిపింది. 2016-17 మొదటి త్రైమాసికం నుంచి 2017-18 మొదటి త్రైమాసికం వరకు బెస్ట్, ఫెర్న్, మోడ్‌లాండ్‌కు రూ.473 కోట్ల రుణాలను ఇచ్చారు. వాటిని ప్రతి త్రైమాసికం చివర్లో తిరిగి చెల్లించినట్లుగా చూపించి, మళ్లీ ఆ తర్వాతి త్రైమాసికం మొదట్లో కొత్తగా రుణమిచ్చినట్లుగా చూపించారని సెబీ తెలిపింది. వాస్తవానికి రుణాల తిరిగి చెల్లింపు జరగలేదని పేర్కొంది. ఎఫ్‌హెచ్‌ఎల్‌ నుంచి భారీగా (రూ.397.12 కోట్లు) నిధుల మళ్లింపు, ఆర్థిక వివరాల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకోవడాన్ని సెక్యూరిటీ మార్కెట్ల ప్రయోజనాల దృష్ట్యా తేలికగా తీసుకోకూడదని సెబీ తన 179 పేజీల ఆదేశాల్లో తెలిపింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని బెస్ట్, ఫెర్న్, మోడలాండ్‌కు రూ.5 కోట్లు చొప్పున జరిమానా విధించింది. మరికొన్ని సంస్థలకు రూ.1 కోటి.. ఇంకొన్ని సంస్థలకు రూ.25 లక్షలు చొప్పున మొత్తంగా 32 సంస్థలకు రూ.38.75 కోట్ల జరిమానాను సెబీ విధించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని