సాధారణ బీమా కంపెనీలో పేటీఎం రూ.950 కోట్ల పెట్టుబడులు

డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ ఒన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం) మరో సంస్థతో కలిసి పేటీఎం జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ (పీజీఐఎల్‌) అనే సాధారణ బీమా సంయుక్త సంస్థను నెలకొల్పుతోంది.

Published : 22 May 2022 02:56 IST

దిల్లీ: డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ ఒన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం) మరో సంస్థతో కలిసి పేటీఎం జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ (పీజీఐఎల్‌) అనే సాధారణ బీమా సంయుక్త సంస్థను నెలకొల్పుతోంది. ఇందులో వచ్చే 10 ఏళ్లలో రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలిపింది. ఈ బీమా కంపెనీలో ఒన్‌97 కమ్యూనికేషన్స్‌కు 49 శాతం వాటా, పేటీఎం ఎండీ విజయ్‌ శేఖర్‌ శర్మకు చెందిన మరో సంస్థ వీఎస్‌ఎస్‌ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు (వీహెచ్‌పీఎల్‌) 51 శాతం వాటా ఉంటాయి. వచ్చే 10 ఏళ్లలో పేటీఎం రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టాక, పేటీఎం వాటా 74 శాతానికి పెరుగుతుందని కంపెనీ వెల్లడించింది. భారతీయ బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నుంచి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ రాగానే సాధారణ బీమా వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. ముంబయికి చెందిన సాధారణ బీమా ప్రైవేటు కంపెనీ రహేజా క్యూబీఈని కొనుగోలు చేసేందుకు 2020 జులైలో వాటా కొనుగోలు ఒప్పందం జరిగినా, నిర్ణీత గడువులోపు అది కార్యరూపం దాల్చకపోవడంతో, తాజాగా సంయుక్త సంస్థ ఏర్పాటుకు పేటీఎం సిద్ధమైంది. ఒన్‌97 కమ్యూనికేషన్స్‌ ఎండీగా మరో అయిదేళ్లపాటు విజయ్‌ శేఖర శర్మ పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీ గ్రూప్‌ సీఎఫ్‌ఓ, ప్రెసిడెంట్‌ మధుర్‌ దేవ్‌రాను పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని