సిమెంట్‌ ధర తగ్గిస్తాం: శ్రీ సిమెంట్‌

దేశవ్యాప్తంగా అతిత్వరలో ధరలు తగ్గిస్తామని శ్రీ సిమెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టరు హెచ్‌.ఎం.బంగూర్‌ తెలియజేశారు. పెట్రో ధరలకు అనుగుణంగా రవాణా ఛార్జీలు తగ్గొచ్చనే అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దేశంలోనే సిమెంటు తయారీలో ఈ సంస్థ మూడో స్థానంలో ఉంది.

Published : 29 May 2022 02:34 IST

రవాణా ఖర్చులు తగ్గుతున్నందునే

కోల్‌కతా: దేశవ్యాప్తంగా అతిత్వరలో ధరలు తగ్గిస్తామని శ్రీ సిమెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టరు హెచ్‌.ఎం.బంగూర్‌ తెలియజేశారు. పెట్రో ధరలకు అనుగుణంగా రవాణా ఛార్జీలు తగ్గొచ్చనే అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దేశంలోనే సిమెంటు తయారీలో ఈ సంస్థ మూడో స్థానంలో ఉంది. సాధారణంగా వర్షాకాలం ప్రారంభానికి ముందు కంపెనీ ధరలను పెంచుతుంటుంది. ఈసారి ఇందుకు భిన్నంగా శ్రీ సిమెంట్‌ ధరలను తగ్గిస్తుండటం గమనార్హం. ‘ఎంత మేర ధరలను తగ్గిస్తామన్నది.. రవాణాదార్లు తగ్గించే ధర, ఆయా విపణులపై ఆధారపడి ఉంటుంద’ని బంగూర్‌ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు పెట్రోలు, డీజిల్‌పై ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ‘ఇప్పటికే ఈ విషయమై (ధరల తగ్గింపుపై) రవాణాదార్లతో మాట్లాడాం. దీనిపై పూర్తి స్పష్టత వచ్చేందుకు ఒక వారం పట్టొచ్చు. వాళ్లు ధరలు తగ్గించిన వెంటనే ఆ పూర్తి ప్రయోజనాన్ని వినియోగదార్లకు బదిలీ చేస్తామ’ని బంగూర్‌ వివరించారు. శ్రీ సిమెంటు 50 కిలోల బస్తా ధర రూ.10-30 మేర తగ్గే అవకాశం ఉందని తూర్పు భారత ప్రాంత డీలర్లు భావిస్తున్నారు. రవాణా వ్యయాల రూపంలోనే కాకుండా సొంత ఇంధన వినియోగపరంగా కూడా కంపెనీకి ఉత్పత్తి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. కంపెనీకి అయ్యే మొత్తం ఖర్చులో రవాణా, లాజిస్టిక్స్‌ వాటా 30 శాతం కాగా.. విద్యుత్‌, ఇంధన వ్యయాలు 20 శాతం వరకు ఉంటాయి. జనవరి- మార్చిలో శ్రీ సిమెంట్‌ రవాణా వ్యయాలు 1 శాతం పెరగ్గా.. ఇంధనం, విద్యుత్‌ ఖర్చులు 73 శాతం మేర అధికమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మార్జిన్‌లు కాపాడుకునే ఉద్దేశంతో శ్రీ సిమెంట్‌ పలుమార్లు ధరలను పెంచడం వల్ల అమ్మకాలు 2.3 శాతం మేర తగ్గాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని