Published : 25 Jun 2022 03:16 IST

ఫిన్‌టెక్‌కు చిక్కులు తప్పవా?

ప్రీపెయిడ్‌ కార్డులకు రుణాలు ఇవ్వొద్దంటూ ఆర్‌బీఐ ఆదేశాల ఫలితం

బీఎన్‌పీఎల్‌ సేవలు దూరమయ్యే అవకాశం

నిబంధన అమలు ఏడాది వాయిదాకు వినతులు

ఈనాడు - హైదరాబాద్‌

‘రూ.20 వేల లోపు వస్తువు కొనాలనుకుంటే.. చేతిలో లేదా బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా ఇబ్బంది లేదు.. క్రెడిట్‌ కార్డు అవసరం లేదు. ఏదో ఒక ఫిన్‌టెక్‌ సంస్థ/వాలెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, వారు అడిగిన వివరాలు ఇస్తే చాలు.. క్షణాల్లోనే కావాల్సింది కొనేందుకు అవసరమైన మొత్తం మీ వాలెట్లో జమ అవుతోంది’.. ‘ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి’ (బై నౌ పే లేటర్‌- బీఎన్‌పీఎల్‌) పేరుతో అమలు చేస్తున్న ఈ రుణ విధానం కింద ముందస్తు చెల్లింపు సాధనాల్లో (ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ - పీపీఐ) బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, ఫిన్‌టెక్‌ సంస్థలు రుణంపై డబ్బు నింపుతున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థతో సంబంధం లేకుండా జరుగుతున్న ఈ సేవలు కొనసాగిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరించింది.

బ్యాంకులతో ఒప్పందం ద్వారా

దేశంలోని కొన్ని ఫిన్‌టెక్‌ సంస్థలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని, ప్రీపెయిడ్‌ కార్డులను అందిస్తున్నాయి. మరికొన్ని ఎన్‌బీఎఫ్‌సీల భాగస్వామ్యంతో ఈ కార్డులకు రుణాలను అందిస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఫిన్‌టెక్‌ సంస్థలే సొంత ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా ఈ మొత్తాలను అందిస్తున్నాయి. వినియోగదారు అర్హతను బట్టి, ఈ కార్డులు రూ.10-20వేల మేర రుణాలిస్తున్నాయి.  

సమస్యేమిటంటే..

ప్రీపెయిడ్‌ కార్డులు బ్యాంకు డెబిట్‌ కార్డు తరహాలోనే పనిచేస్తాయి. వీటిలో డబ్బు నిల్వను నేరుగా బ్యాంకులో నగదు జమ/ బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌/ క్రెడిట్‌ కార్డు ద్వారానే భర్తీ చేయాలి. అందుకు భిన్నంగా రుణాల ద్వారా నింపుతూ బీఎన్‌పీఎల్‌ సంస్థలు వినియోగదారులకు పరోక్షంగా రుణదాతలుగా మారుతూ, తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీలు కార్డులను జారీ చేయలేవు. వాలెట్‌ సంస్థలు రుణాలు ఇచ్చేందుకు   వీల్లేదు. కానీ ఎన్‌బీఎఫ్‌సీలు నేరుగా వాలెట్ల ప్రీ పెయిడ్‌ కార్డులకు రుణాలను ఇస్తున్నాయి. అంటే, బ్యాంకింగ్‌ వ్యవస్థను ఇవి దారి మళ్లిస్తున్నాయి. దీనివల్ల ప్రీపెయిడ్‌ కార్డుల స్ఫూర్తి దెబ్బతింటుందని, ఫిన్‌టెక్‌ సంస్థలు ఒక రకంగా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నట్లుగానే అవుతోందని ఆర్‌బీఐ భావిస్తోంది.  

ఈ కంపెనీలపై ప్రభావం

స్లైస్‌, యూని కార్డ్స్‌, లేజీపే, పోస్ట్‌పే, మొబిక్విక్‌, ఓలా పోస్ట్‌పెయిడ్‌, ఎర్లీ శాలరీ, జూపిటర్‌, క్రెడిట్‌బీ పాటు మరికొన్ని నియో బ్యాంకింగ్‌ సంస్థలపైనా ప్రభావం పడనుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీపే, ఐసీఐసీఐ పేలేటర్‌, ఎస్‌బీఐ యోనో తదితర సేవలకూ అంతరాయం కలిగే అవకాశం ఉంది.

ప్రత్యామ్నాయం ఉంది

ఫిన్‌టెక్‌ సంస్థలు బ్యాంకులతో ఒప్పందాన్ని కుదుర్చుకుని, వినియోగదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసే అవకాశాన్ని పరిశీలించే వీలుందని నిపుణులు పేర్కొంటున్నారు. స్వల్పకాలిక వ్యక్తిగత రుణాల విభాగంలోకి వీటిని తీసుకొచ్చి, ఇప్పుడు అందిస్తున్న సేవలను కొనసాగించే వీలుంటుందని అంటున్నారు. ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్‌ కార్డుల జారీ కోసం ప్రత్యేకంగా లైసెన్సులు తీసుకోవాలని ఆర్‌బీఐ సూచిస్తోంది.

ఏడాది గడువు ఇవ్వాలి: సంస్థల అభ్యర్థన

ఆర్‌బీఐ తాజా నిబంధనల అమలుకు కనీసం ఏడాది సన్‌సెట్‌ క్లాజు వర్తింపచేయాలని ఫిన్‌టెక్‌ సంస్థలు కోరుతున్నాయి.  ఒక్కసారిగా వ్యాపార విధానాన్ని మార్చుకోవడం కష్టమవుతుందని చెబుతున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని