రూ.2340 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ!

ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే 30 ఏళ్లలో 30 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.2340 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందనే అంచనాను వాణిజ్య మంత్రి పీయూష్‌గోయల్‌ వ్యక్తం చేశారు.

Published : 27 Jun 2022 03:24 IST

30 ఏళ్లలో సాకారం: మంత్రి పీయూష్‌ గోయల్‌

తిరుప్పూర్‌: ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే 30 ఏళ్లలో 30 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.2340 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందనే అంచనాను వాణిజ్య మంత్రి పీయూష్‌గోయల్‌ వ్యక్తం చేశారు. మనదేశం కనుక ఏటా 8 శాతం వృద్ధిని సాధిస్తే, 9 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ స్థాయి రెట్టింపవుతుందని వివరించారు. ఆ లెక్కన ప్రస్తుతం 3.2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.250 లక్షల కోట్ల) స్థాయిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 9 ఏళ్లలో 6.5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.507 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని పేర్కొన్నారు. 18 ఏళ్లకు 13 లక్షల కోట్ల డాలర్లకు, 27 సంవత్సరాలకు 26 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని.. ఆ లెక్కన ఇప్పటి నుంచి 30 ఏళ్ల తరవాత చూస్తే 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి మన ఆర్థిక వ్యవస్థ చేరుతుందని విశ్లేషించారు. ఈ అంచనాలపై అనుమానాలున్న వారు తిరుప్పూర్‌ వంటి ప్రాంతాలకు వచ్చి, జౌళి రంగంలో సాధించిన వృద్ధిని గమనించాలని సూచించారు. కొవిడ్‌ పరిణామాలకు తోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఏర్పడిన సవాళ్లలోనూ మన ఆర్థిక వ్యవస్థ సంతృప్తికరంగా వృద్ధి చెందుతోందని మంత్రి వివరించారు. ద్రవ్యోల్బణం కూడా ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర సహేతుకంగానే ఉందని పేర్కొన్నారు. అనేక వస్తువుల విషయంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే మన దగ్గర ధరలు అదుపులో ఉన్నాయని తెలిపారు.

అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల  జౌళి ఎగుమతులు: ప్రస్తుతం దేశ జౌళి రంగం రూ.10 లక్షల కోట్ల స్థాయిలో ఉందని, ఎగుమతులు రూ.3.5 లక్షల కోట్ల మేర జరుగుతున్నాయని గోయల్‌ చెప్పారు. అయిదేళ్లలో పరిశ్రమ రూ.20 లక్షల కోట్లకు, ఎగుమతులు రూ.10 లక్షల కోట్లకు చేరే స్థాయి ఈ రంగానికి ఉందని పేర్కొన్నారు. 37 ఏళ్ల క్రితం తిరుప్పూర్‌ ఎగుమతులు రూ.15 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ.30,000 కోట్ల స్థాయిలో జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి నగరాలు దేశంలో మరో 75 ఏర్పడాలన్నది ప్రభుత్వ ఆకాంక్షగా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని