Published : 15 Oct 2021 03:34 IST

పాలసీలు.. డిజిటల్‌ రూపంలో..

కొవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో అన్ని వ్యాపారాలూ.. సేవలూ డిజిటల్‌కు మారిపోతున్నాయి. బీమా పాలసీలూ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇన్సూరెన్స్‌ రిపాజిటరీ సేవలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం బీమా పాలసీలను డిజిటల్‌లో భద్రపర్చుకునే వెసులుబాటు వచ్చినా.. బీమా సంస్థలు, పాలసీదారులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు తప్పనిసిరి పరిస్థితుల్లో పాలసీలను డిజిటల్‌లోనే అందిస్తున్న నేపథ్యంలో ఈ సేవలకు ప్రాధాన్యం పెరిగింది.

ఒక్కో పాలసీని వేర్వేరు సంస్థల నుంచి తీసుకుంటారు. వీటన్నింటి నిర్వహణా చాలా సందర్భాల్లో కష్టమే. ఏదైనా చిరునామా మార్చాలన్నా.. ఫోన్‌ నెంబరు కొత్తది ఇవ్వాలన్నా.. అన్ని సంస్థలనూ సంప్రదించాలి. దీనికి బదులుగా ఇన్సూరెన్స్‌ రిపాజిటరీ ఖాతాలో పాలసీలను నిర్వహిస్తే.. అన్ని పనులూ ఒక్క క్లిక్‌తోనే చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే.. ఇది బీమా పాలసీలకు సంబంధించిన డీమ్యాట్‌ ఖాతా అన్నమాట. ఇన్సూరెన్స్‌ రిపాజిటరీ దగ్గర ఖాతా ప్రారంభించి, ఏ బీమా పాలసీనైనా ఇందులో దాచుకోవచ్చు. ప్రతి ఇ-ఇన్సూరెన్స్‌ ఖాతాకు ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. పాలసీదారుడు తమ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా రిపాజిటరీ ఖాతాలోకి వెళ్లి, పాలసీల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

పాలసీలన్నీ.. డిజిటల్‌ రూపంలో ఉంటాయి, కాబట్టి, ప్రత్యేకంగా ప్రతి పాలసీ డాక్యుమెంట్‌ కోసం వెతుక్కోనక్కర్లేదు. కొవిడ్‌-19 బారినపడి, ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించిన పాలసీ పత్రాలు ఎక్కడున్నాయో తెలియక చాలామంది ఇబ్బంది పడిన సంఘటనలున్నాయి.

ఇ-ఇన్సూరెన్స్‌ ఖాతా వివరాలు తెలిస్తే.. నామినీ సులభంగా అన్ని పాలసీలను క్లెయిం చేసుకునే అవకాశం ఉంటుంది.

బీమా పాలసీలను డిజిటల్‌లోకి మార్చడానికి మీరు ప్రత్యేకంగా ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఇంటి నుంచే ఈ ప్రక్రియనంతా పూర్తి చేయొచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులు చేయడమూ సులభంగా పూర్తి చేయొచ్చు.

ఒకసారి మీ ఖాతాలోకి ప్రవేశించి, డాష్‌బోర్డును చూస్తే.. ఏ పాలసీకి ప్రీమియం చెల్లించాలి? వ్యవధి ఎంత ఉంది?లాంటి వివరాలన్నీ కనిపిస్తాయి. దీనివల్ల ఆ సమయానికి డబ్బులు సమకూర్చుకోవడం తేలికవుతుంది.

అన్ని రకాల పాలసీలనూ ఒకే ఖాతాలో నిర్వహించుకోవచ్చు.

కొవిడ్‌ నేపథ్యంలో ఇంటి నుంచి కదలకుండానే అన్ని పాలసీలకు సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఇన్సూరెన్స్‌ రిపాజిటరీ ఖాతా ఉపయోగపడుతుంది.

ఇందులో ఉన్న మరో విశేషం ఏమిటంటే.. ఇది పూర్తిగా ఉచితంగానే లభిస్తుంది. ఒక దరఖాస్తు పత్రం, దానికి సంబంధించి అవసరమైన అన్ని పత్రాలనూ సమర్పిస్తే సరిపోతుంది.

- కె.రామ్‌కుమార్‌, చీఫ్‌ ఆఫ్‌ బిజినెస్‌, ఆపరేషన్స్‌, సీడీఎస్‌ఎల్‌

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని