ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళలో...

జీవితంలో సాధించాల్సిన ఆర్థిక లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. ఇందుకోసం సంపాదనలో తప్పనిసరిగా కొంత మొత్తం పెట్టుబడులకు కేటాయించాల్సిందే. వీటి నుంచి వచ్చిన రాబడితోనే సంపదను సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. మన నికర రాబడిని తగ్గిస్తూ ఉంటుంది.

Updated : 10 Jun 2022 07:04 IST

జీవితంలో సాధించాల్సిన ఆర్థిక లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. ఇందుకోసం సంపాదనలో తప్పనిసరిగా కొంత మొత్తం పెట్టుబడులకు కేటాయించాల్సిందే. వీటి నుంచి వచ్చిన రాబడితోనే సంపదను సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. మన నికర రాబడిని తగ్గిస్తూ ఉంటుంది. అందుకే, దీర్ఘకాలంలో దీని ప్రభావం అంతగా ఉండని పెట్టుబడులను ఎంచుకోవడం ఎప్పుడూ అవసరం.

ప్రస్తుతం మన దేశంలో ధరల పెరుగుదల ఊహించిన దానికన్నా అధికంగా ఉంది. ఈ అధిక ద్రవ్యోల్బణం వల్ల పెట్టుబడుల విలువ వేగంగా తగ్గిపోతుంది. ఉదాహరణకు ఒక పెట్టుబడి పథకంపై 7 శాతం రాబడి వస్తుందనుకుందాం. ద్రవ్యోల్బణం 6 శాతం ఉంటే.. నికర రాబడి 1 శాతం మాత్రమే. కాబట్టి, ఏదైనా పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేటప్పుడు.. సగటు రాబడి ద్రవ్యోల్బణాన్ని మించి కనీసం 2-3 శాతం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు మార్గం సుగమమవుతుంది.

పసిడి మార్గం... 

ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే పెట్టుబడి సాధనం అనగానే ముందుగా గుర్తు కొచ్చేది బంగారమే. అధిక ద్రవ్యోల్బణ  పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థలన్నీ పసిడినే నమ్ముకుంటాయి. బంగారం ద్వారా వచ్చే రాబడులు ప్రతిసారీ అధికంగా ఉండక పోవచ్చు. అయితే, అనిశ్చితి అధికంగా ఉన్నప్పుడు, యుద్ధం వంటివి వచ్చినప్పుడు నమ్మకమైన మదుపుగా దీన్ని పేర్కొనవచ్చు. దీర్ఘకాలిక వ్యూహంతో దీన్ని ఎంచుకున్నప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నేరుగా బంగారాన్ని కొనడం, గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు, సావరీన్‌ గోల్డ్‌ బాండ్లు (ఎస్‌జీబీ) ఇందుకోసం పరిశీలించవచ్చు. ఎస్‌జీబీలో పెట్టుబడులు పెట్టినప్పుడు 2.5 శాతం వార్షిక రాబడిని అందిస్తుంది. వ్యవధి తీరాక వచ్చిన మొత్తంపై మూలధన రాబడి పన్ను ఉండదు. 

ఈక్విటీలతో..
స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత పెట్టుబడులు.. అంటే నేరుగా షేర్లలో మదుపు చేసినా, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకున్నా కాస్త నష్టభయం ఉంటుంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు స్వల్పకాలంలో వీటిలో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఇవి వేగంగా స్పందిస్తుంటాయి. దీర్ఘకాలంలో మదుపరులకు స్టాక్‌ మార్కెట్‌ ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. ఈక్విటీ ఫండ్లు, షేర్లలో మదుపు చేయాలనుకున్నప్పుడు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ఎంచుకోవడం మంచిది. దీనివల్ల రూపాయి సగటు ప్రయోజనం లభిస్తుంది. నష్టభయమూ తగ్గుతుంది. ఈక్విటీల్లో మదుపు చేస్తున్నప్పుడు వీలైనంత వరకూ వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి.

మీరు ఎంత మేరకు నష్టాన్ని తట్టుకోగలరు, ఎంత రాబడిని ఆశిస్తున్నారు అనే అంశాలను స్పష్టంగా తెలుసుకున్నాకే ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను ఎంచుకోవాలి. ఉన్న డబ్బంతా వీటికే కేటాయించకూడదు. దీర్ఘకాలం కొనసాగించినప్పుడే వీటి ద్వారా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని అందుకోగలం. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వారు.. నేరుగా షేర్లలో మదుపు చేసే బదులు, మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించడమే మేలు. 

స్థిరాస్తిలో..
బంగారాన్ని నేరుగా లేదా డిజిటల్‌లో కొనుగోలు చేసేందుకు వీలుంది. ఇదే తరహాలో స్థిరాస్తుల్లో నేరుగా పెట్టుబడులు పెట్టొచ్చు. దీంతో పాటు డిజిటల్‌ ద్వారానూ మదుపు చేయొచ్చు. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(రీట్స్‌)ను ఇందుకోసం ఎంచుకోవచ్చు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయంలో నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతుంటాయి. బ్యాంకులు గృహరుణాలపైన వడ్డీనీ పెంచుతాయి. దీనివల్ల స్థిరాస్తుల ధరల్లోనూ వృద్ధి కనిపిస్తుంది. వీటన్నింటి ఫలితంగా అద్దెలూ పెరుగుతాయి. కాబట్టి, ఇలాంటి సమయంలో రీట్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడిని సొంతం చేసుకునే అవకాశం ఉంది. రీట్స్‌లో చిన్న మొత్తంతోనూ పెట్టుబడి పెట్టేందుకు వీలవుతుంది.

ఇవీ మ్యూచువల్‌ ఫండ్ల తరహాలోనే పని చేస్తాయి. మదుపరుల నుంచి సమీకరించిన మొత్తాన్ని ఫండ్లు షేర్లలో మదుపు చేస్తాయి. రీట్స్‌ ఆదాయాన్ని అందించే స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతాయి. రీట్స్‌ను ఎంచుకునే ముందు వాటి ఆధీనంలో ఏయే ఆస్తులున్నాయన్నది తెలుసుకోవాలి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను అనుసంధానిస్తూ వీటిని ఎంచుకోవడం ఉత్తమం. 

స్వల్పకాలిక డెట్‌ పథకాల్లో..
వడ్డీ రేట్లు పెరుగుతున్న పరిస్థితుల్లో దీర్ఘకాలిక డెట్‌ పథకాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో డెట్‌ ఫండ్లలో మదుపు చేసేవారు.. వీటికి బదులుగా స్వల్పకాలిక డెట్‌ పథకాలను పరిశీలించాలి. అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్లు, లిక్విడ్‌ ఫండ్ల మీద వడ్డీ రేట్ల పెంపు పెద్దగా ప్రభావం చూపదు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న దశలో.. మీ మిగులు మొత్తాన్ని షార్ట్‌/అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు.

పెట్టుబడి పథకాల పనితీరు ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు ఉండాలి. నష్టభయం భరించే సామర్థ్యం, వయసు, భవిష్యత్‌ లక్ష్యాలు ఇవే పథకాల ఎంపికలో కీలకమని మర్చిపోవద్దు.

- అధిల్‌శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని