IPO: ఐపీఓ ధరల్ని నిర్ణయించిన ఫ్యూజన్‌ మైక్రోఫైనాన్స్‌, మేదాంతా

వచ్చే నెల ఐపీఓకి రానున్న ఫ్యూజన్‌ మైక్రోఫైనాన్స్‌, గ్లోబల్‌హెల్త్‌ లిమిటెడ్‌ తమ ధరల శ్రేణిని నిర్ణయించాయి.

Published : 28 Oct 2022 15:53 IST

దిల్లీ: వచ్చే నెల 2న ఐపీఓకి రానున్న ఫ్యూజన్‌ మైక్రోఫైనాన్స్‌ ఐపీఓ ధరల శ్రేణిని నిర్ణయించింది. ఒక్కో షేరును రూ.350-368 వద్ద అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. గరిష్ఠ ధర వద్ద రూ.1,104 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపింది. ఈ ఐపీఓ షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ నవంబరు 4న ముగియనుంది. రూ.600 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 1,36,95,466 షేర్లను విక్రయించనున్నారు. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల ద్వారా క్యాపిటల్‌ బేస్‌ను పెంచుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ ప్రత్యేకంగా మహిళలకు ఆర్థిక సేవలందిస్తోంది.

మరోవైపు మేదాంతా బ్రాండ్‌ పేరిట ఆస్పత్రులను నిర్వహిస్తోన్న గ్లోబల్‌ హెల్త్‌ లిమిటెడ్‌ సైతం తమ ధరల శ్రేణిని రూ.319-336గా నిర్ణయించింది. ఈ కంపెనీ ఐపీఓ నవంబరు 3-7వ తేదీల మధ్య జరగనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూలో రూ.500 కోట్లు విలువ చేసే తాజా షేర్లను జారీ చేయనున్నారు. అలాగే 5.08 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) కింద విక్రయించనున్నారు. ఐపీఓలో సమీకరించిన నిధులతో రుణ భారాన్ని తగ్గించుకోనున్నారు. అలాగే సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కూడా కొన్ని నిధుల్ని వెచ్చించనున్నారు. గురుగ్రామ్‌, ఇండోర్‌, రాంచీ, లఖ్‌నవూ, పట్నాలో మేదాంతా ఆస్పత్రులు ఉన్నాయి. మరొకటి నోయిడాలో నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్పత్రుల సామర్థ్యం 3,500 పడకలు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts