EPF balance: మీ పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలన్స్ ఉందో తెలుసుకోండిలా..

ఒక ఉద్యోగి ప్రతి నెలా తన ప్రాథమిక జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారు

Updated : 16 Apr 2022 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రతి ఉద్యోగి చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే.. తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడం. ఒక ఉద్యోగి ప్రతి నెలా తన ప్రాథమిక జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారు. అలాగే వారి యజమాని కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తారు. అయితే, పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించకుండా, మీరు పనిచేసే సంస్థ యజమానిని అడగకుండానే పీఎఫ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అవేంటో కింద చూద్దాం.. 

ఈపీఎఫ్ఓ ​​వెబ్‌సైట్: ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ (www.epfindia.gov.in)ను సందర్శించి.. అందులో "Our Services" విభాగంలోని "For Employees" ఆప్షన్ పై క్లిక్ చేయండి. అనంతరం "Member Passbook" ఆప్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ మీ యూఏఎన్, పాస్ వర్డ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత అప్పటి వరకు మీరు, మీ యజమాని చేసిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్‌ను చూడొచ్చు. అలాగే అప్పటి వరకు మీరు పొందిన పీఎఫ్ వడ్డీ మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఒకవేళ మీ యూఏఎన్‌కు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పీఎఫ్ నంబర్లు జోడించి ఉన్నట్లయితే, అవి కూడా చూడొచ్చు.

యూనిఫైడ్ పోర్టల్: మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌తో యూనిఫైడ్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి, అందులో పీఎఫ్ పాస్‌బుక్‌పై క్లిక్ చేసి మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చూడొచ్చు. అలాగే, మీరు వివిధ ఆర్థిక సంవత్సరాల్లో కాంట్రిబ్యూట్ చేసిన పీఎఫ్ మొత్తాన్ని కూడా చూడొచ్చు.

ఎస్ఎంఎస్: యూఏఎన్ లేకుండా మొబైల్‌ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవడానికి మీరు ఎస్సెమ్మెస్‌ సేవను ఉపయోగించుకోవచ్చు. దీని కోసం మీరు మొబైల్లో EPFOHO UAN ENG అని టైపే చేసి 77382 99899 నంబర్‌కి ఎస్సెమ్మెస్‌ పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మాత్రమే ఎస్సెమ్మెస్‌ పంపించాలి. పంపిన తర్వాత మీ చివరి పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌తో పాటు మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను అందుకుంటారు.

మిస్డ్ కాల్: యూనిఫైడ్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ నమోదు చేసుకున్న వినియోగదారులు 011-22901406 నంబబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఎస్సెమ్మెస్‌ పొందుతారు. దీని కోసం మీకు యూఏఎన్ కూడా అవసరం లేదు. ఈ సర్వీసును పూర్తి ఉచితంగా తమ వినియోగదారులకు ఈపీఎఫ్ఓ అందిస్తోంది. 

ఉమాంగ్ యాప్‌: పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్, మీ కేవైసీ స్థితి వంటి ఈపీఎఫ్ వివరాలను పొందడానికి ఉమాంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్) యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని