Digital Rupee: ఎస్‌బీఐ కస్టమర్లు ఇ-రూపీని ఎలా లోడ్‌ చేసుకోవాలి?

ఇ-రూపీలో 50 పైసలు, రూ.1, రూ.2 కాయిన్లు, రూ.20, రూ.50, రూ. 100, రూ.200, రూ.500, రూ.2000 నోట్లు అందుబాటులో ఉంటాయి

Published : 16 Dec 2022 13:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవల డిజిటల్ రూపీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది భారతదేశ సొంత డిజిటల్ కరెన్సీ. దీన్ని ఇ-రూపీ లేదా డిజిటల్ రూపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)గా వ్యవహరిస్తారు. ఇది ఫియట్‌ కరెన్సీ నోట్ల ఎలక్ట్రానిక్ రూపం. బ్యాంకు నోట్ల మాదిరిగానే ఉంటుంది. కానీ, డిజిటల్‌ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దీన్ని జారీ చేస్తుంది. అలాగే నియంత్రింస్తుంది.

ఏయే బ్యాంకుల్లో అందుబాటులో ఉంది?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిటైల్ డిజిటల్ రూపీని దశల వారీగా ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఎనిమిది బ్యాంకులను గుర్తించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ఐసీఐసీఐ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ సహా నాలుగు బ్యాంకులు మొదటి దశ పైలట్ ప్రోగ్రామ్‌లో భాగం కాగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటల్ మహీంద్రా బ్యాంకులను రెండో దశ పైలట్‌ ప్రాజెక్టులో చేర్చారు. ఈ పైలట్ ప్రాజెక్ట్‌ ప్రారంభంలో ముంబయి, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌ సహా నాలుగు నగరాలను కవర్‌ చేయగా.. తర్వాత అహ్మదాబాద్, గాంగ్టాక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లఖ్‌నవూ, పట్నా, శిమ్లా వరకు విస్తరించారు.

ఇ-రూపీ వ్యాలెట్‌ ఉండాలి..

ప్రస్తుతం సీయూజీ (క్లోజ్డ్‌ యూజర్‌ గ్రూప్‌)లో ఉన్న కస్టమర్లు, వ్యాపారులు ఇ-రూపీని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకు ఇ-రూపీ వ్యాలెట్‌ అవసరం. ఫిజికల్ వాలెట్‌లో ఫిజికల్ కరెన్సీని భద్రపరుచుకున్నట్లుగానే, ఇ-రూపీ వ్యాలెట్‌లో ఇ-రూపీని స్టోర్‌ చేసుకోవాలి. ఇ-రూపీలో 50 పైసలు, రూ.1, రూ.2 కాయిన్లు, రూ.20, రూ.50, రూ. 100, రూ.200, రూ.500, రూ.2000 నోట్లు అందుబాటులో ఉంటాయి. 

ఇ-రూపీ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి? 

బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే ఇ-రూపీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో గానీ, యాపిల్‌ స్టోర్‌లో గానీ ఈ యాప్‌లు అందుబాటులో లేవు. ఎస్‌బీఐ అనుమతించిన యూజర్లు బ్యాంకు వెబ్‌సైట్‌ నుంచి యాప్‌ డైన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి?

  • ఎస్‌బీఐ ఇ-రూపీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత.. ఎంటర్‌ బటన్‌పై క్లిక్‌చేయాలి. 
  • ఆ తర్వాత నియమ నిబంధనల పేజీ తెరుచుకుంటుంది. వీటిని పూర్తిగా చదివి యాక్సెప్ట్‌పై క్లిక్‌ చేయాలి. 
  • ఇప్పుడు స్టార్ట్‌ రిజిస్ట్రేషన్‌పై క్లిక్‌ చేయాలి. 
  • మీ ఫోన్‌లో సిమ్‌ కార్డులను ఆటోమేటిక్‌గా యాప్‌ గుర్తిస్తుంది. ఇందులో నుంచి మీరు బ్యాంకు వద్ద రిజిస్టర్‌ చేసుకున్న సిమ్‌ను ఎంచుకోవాలి. 
  • సిమ్‌ వెరిఫికేషన్‌పై క్లిక్‌ చేయాలి. సిమ్‌ వెరిఫికేషన్‌ విజయవంతంగా పూర్తయిన తర్వాత కంటిన్యూ బటన్‌పై క్లిక్‌ చేయాలి. 
  • ఆ తర్వాత సెక్యూరిటీ పిన్‌ సెట్‌ చేసుకోవాలి. మీ ఫోన్‌లో ఫింగర్‌ ప్రింట్‌, ఐ స్కానర్‌, ఫేస్‌ గుర్తింపు ఆప్షన్లు ఉంటే వాటి ద్వారా కూడా సెక్యూరిటీ పిన్‌ సెట్‌ చేసుకోవచ్చు. 
  • ఆధార్‌లో ఉన్నట్లు పేరు ఎంటర్‌ చేసి వ్యాలెట్‌ను ఎంచుకోవాలి.
  • రికవరీ కోడ్‌ను సెట్‌ చేసుకోవాలి. గెట్‌ రికవరీ కోడ్‌పై క్లిక్‌ చేసి క్రియేట్‌ పిన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఇక్కడ 6 నంబర్లతో పిన్‌ సెట్‌ చేసుకోవచ్చు. 

బ్యాంకు ఖాతాను లింక్‌ చేసుకునే విధానం..

  • వ్యాలెట్‌ పిన్‌ సెట్‌ చేసుకున్న తర్వాత సెలక్ట్‌ వ్యాలెట్‌ను క్లిక్‌ చేయాలి. 
  • ఇక్కడ వ్యాలెట్‌ అడ్రస్‌ను చూడొచ్చు. ఇక్కడ మూడు ఆప్షన్లు ఉంటాయి. కంటిన్యూ, ఆధార్‌ కేవైసీ, లింక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా అకౌంట్‌ అందుబాటులో ఉంటాయి. మూడో ఆప్షన్‌ను ఎంచుకుని బ్యాంక్‌ ఖాతాను ఇ-రూపీ వ్యాలెట్‌తో లింక్‌ చేయవచ్చు. 
  • ఇక్కడ మీ బ్యాంక్‌ ఖాతా వివరాలు కనిపిస్తాయి. దాన్ని ఎంచుకోవాలి. 
  • ఆ తర్వాత మీ డెబిట్‌ కార్డు చివరి ఆరు నంబర్లు, ఎక్స్‌పయిరీ తేదీ ఎంటర్‌ చేసి నెక్ట్స్‌ పై క్లిక్‌ చేస్తే, బ్యాంకు ఖాతా ఇ-రూపీ వ్యాలెట్‌తో అనుసంధానం అవుతంది. 

SBI ఇ-రూపీ వ్యాలెట్‌లోకి డబ్బు లోడ్ చేసే విధానం..

  • ముందుగా యాప్ హోమ్ పేజీలో లోడ్‌పై క్లిక్ చేయాలి. 
  • ఇక్కడ మీకు నోట్లు, కాయిన్లు రెండూ కనిపిస్తాయి. 
  • మీరు ఎంత మొత్తం లోడ్‌ చేయాలో అందకు సంబంధించిన నోట్‌, లేదా కాయిన్‌పై క్లిక్‌చేసి యాడ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు రూ.72 వ్యాలెట్‌లోకి యాడ్‌ చేయాలనుకుంటే.. రూ.20, రూ.50 నోట్లు, రూ.2 కాయిన్‌పై స్వైప్‌ చేసి ‘లోడ్‌ ఇ-రూపీ’పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు బ్యాంకు ఖాతాను సెలక్ట్‌ చేసుకుని పిన్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే, మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు ఇ-వ్యాలెట్‌కు లోడ్‌ అవుతుంది.  
  • ఇక్కడ మీరు లోడ్‌ చేసుకున్న నోట్ల సీరియల్‌ నంబర్లు సైతం కనిపిస్తాయి.
  • హోమ్‌ పేజీలో సెండ్‌, కలెక్ట్‌, రిడీమ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. దీంతో ఇ-రూపీని ఇతరులకు పంపించవచ్చు. తీసుకోవచ్చు. అలాగే తిరిగి రిడీమ్‌ కూడా చేసుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని