Housing sales: వడ్డీరేట్లు పెరిగినా తగ్గేదేలే.. గృహ విక్రయాల్లో నయా రికార్డ్‌!

Housing sales in 2022: దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు జరిగాయి. ఇందులో ముంబయి మెట్రోపాలిటన్‌ ప్రాంతం అగ్రస్థానంలో నిలవగా.. హైదరాబాద్‌ సైతం గణనీయమైన వృద్ధిని సాధించింది.

Published : 27 Dec 2022 15:20 IST

దిల్లీ: దేశంలో ఇళ్లకు ఆదరణ కొనసాగుతోంది. సొంతింటి కలను నిజం చేసుకునే క్రమంలో పెరుగుతున్న ధరలు, వడ్డీ రేట్లను సైతం ప్రజలు లెక్క చేయడం లేదని తేలింది. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జరిగిన గృహ విక్రయాల (Housing sales) సంఖ్యను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పైగా ఎన్నడూలేని రీతిలో రికార్డు స్థాయిలో విక్రయాలు ఈ ఏడాదే నమోదు కావడం గమనార్హం. దీంతో నివాస గృహ విక్రయాల విషయంలో 2014 పేరిట ఉన్న రికార్డును ఈ ఏడాది చెరిపివేసిందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అన్‌రాక్‌ (Anarock) తన నివేదికలో తెలిపింది. రుణ వడ్డీ రేట్లు పెరిగినా గృహాలకు డిమాండ్‌ తగ్గలేదని పేర్కొంది. కొవిడ్‌ ముందు నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలిపింది.

2021లో 2,36,500 యూనిట్ల గృహ విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది 54 శాతంగా వృద్ధితో 3,64,900 యూనిట్లు అమ్ముడైనట్లు అన్‌రాక్‌ తెలిపింది. దిల్లీ- ఎన్‌సీఆర్‌, ముంబయి మెట్రోపాలిటిన్‌ రీజియన్‌, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె నగరాలను ఇందుకు ఉదాహరణంగా తీసుకుంది. ఈ ఏడు నగరాల్లో 2014లో 3.43 లక్షల యూనిట్ల గృహ విక్రయాలు జరిగాయి. ఇప్పటి వరకు అదే రికార్డు ఉంది. తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది.

ఈ ఏడాది అత్యధికంగా ముంబయి మెట్రో రీజియన్‌లో 1,09,700 యూనిట్లు అమ్ముడైనట్లు అన్‌రాక్‌ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో దిల్లీ- ఎన్‌సీఆర్‌ (63,712), పుణె (57,146), బెంగళూరు (49,478) ఉన్నాయి. హైదరాబాద్‌లో గతేడాది 25,406 యూనిట్లు విక్రయమవ్వగా.. ఈ ఏడాది ఏకంగా 87 శాతం వృద్ధితో 47,487 యూనిట్లు విక్రయమైనట్లు నివేదిక తెలిపింది. చెన్నై 29 శాతం వృద్ధితో 16,097 యూనిట్లు, కోల్‌కతాలో 21,220 యూనిట్ల ఇళ్ల కొనుగోళ్లు జరిగినట్లు పేర్కొంది. నివాస స్థలాల ధరలు, వడ్డీ రేట్లు పెరుగుదల, భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితులు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ ఏడాది నివాస గృహ విక్రయాలు గణనీయమైన వృద్ధిని సాధించాని అన్‌రాక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ పురి ఈ సందర్భంగా పేర్కొన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని