ప‌న్ను ఆదా చేసే ముఖ్య‌మైన పెట్టుబ‌డి మార్గాలు

మంచి రాబ‌డిని అందించి, ప‌న్ను మినహాయింపులు ఉండే ముఖ్య‌మైన పొదుపు ప‌థ‌కాలు ఏంటో చూద్దాం.....

Updated : 01 Jan 2021 20:28 IST

ప‌న్ను మిన‌హాయింపుల కోసం ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌ర్లో తొంద‌ర‌పాటుతో ఏదో ఒక ఫండ్ లేదా స్కీముల్లో పెట్టుబ‌డులు పెడుతుంటారు చాలా మంది. కానీ అది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలోనే పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్రారంభించాల‌ని వారి సూచ‌న‌. అప్పుడే స‌రైన మార్గాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. ప‌న్ను ఆదా చేసే స్కీముల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుగా గ‌మ‌నించాల్సింది ఏంటంటే…ఎక్కువ ప‌న్ను ఆదా, త‌క్కువ రిస్క్‌, పెట్టుబ‌డుల వ్య‌యం, రాబ‌డి వంటివి చూసుకోవాలి.

ఆదాయ ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను మిన‌హాయింపులు ఉండే ప‌థ‌కాలు…

ఈక్విటీ-లింక్డ్ పొదుపు పథకం (ఈఎల్ఎస్ఎస్):

ఈక్విటీ-లింక్డ్ పొదుపు పథకం (ఈఎల్ఎస్ఎస్) ఎక్కువ భాగం ఈక్విటీ సాధ‌నాల్లో పెట్టుబడి పెట్టే వైవిధ్యమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడుల నుంచి వచ్చే రాబడులు, ప్రజా భవిష్య నిధి (పీపీఏప్), జాతీయ సేవా సర్టిఫికేట్లు (ఎన్ఏస్సీ), స్థిర బ్యాంకు డిపాజిట్ల నుంచి వచ్చే రాబడులతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, భారతీయ ఆదాయ‌ పన్నుచట్టం, 1961 సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. రూ. 1 లక్ష కంటే ఎక్కువ దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్ను విధిస్తారు. ఈఎల్ఎస్ఎస్ నిధుల లాక్ - ఇన్ సమయం 3 సంవత్సరాలు.ఇందులో సిప్ ద్వారా కూడా పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు.

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌):

ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్‌) అనేది పోస్టాఫీసులు అందిస్తున్న ఓ మంచి దీర్ఘ‌కాల పెట్టుబ‌డి మార్గం. ఇప్పుడు బ్యాంకులు కూడా వీటిని అందిస్తున్నాయి. దీర్ఘ‌కాల ఆర్థిక ల‌క్ష్యాల‌కు ఈ పెట్టుబ‌డి మార్గం ఉత్త‌మం. న‌గ‌దు లేదా చెక్కు ఇచ్చి ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. చెక్కు ఇస్తే ఏ రోజ‌యితే అది చెల్లుబాటు అవుతుందో అదే రోజును ఖాతా ప్రారంభ తేదీగా గుర్తిస్తారు.

మెచ్యూరిటీ వ్య‌వ‌ధి 15ఏళ్లు. అవ‌స‌ర‌మైతే 5ఏళ్ల చొప్పున పొడిగించుకోవ‌చ్చు. వ‌డ్డీ రేటు వార్షికంగా 7.6శాతం (3 నెల‌ల‌కోసారి ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది.) పెట్టుబ‌డిపై వ‌చ్చే వ‌డ్డీకి పూర్తి ప‌న్ను ఆదా ఉంటుంది. పీపీఎఫ్‌లో చేసే పెట్టుబ‌డిపై రూ.1.5ల‌క్ష‌ల దాకా 80సీ సెక్ష‌న్ కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఖాతా ప్రారంభించిన 7వ సంవ‌త్స‌రం నుంచి విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉంది. ఖాతా ప్రారంభించిన 3వ సంవ‌త్స‌రం నుంచి రుణం పొంద‌వ‌చ్చు.

ఒక పోస్టాఫీసు నుంచి మ‌రోదానికి…పోస్టాఫీసు నుంచి బ్యాంకున‌కు ఖాతా బ‌దిలీ చేసుకోవ‌చ్చు. డిపాజిట్ ప‌రిమితి ఏడాదికి రూ.1.5ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. నెల‌కు క‌నీసం రూ.500 జ‌మ‌చేయాలి. ఏడాదికి గ‌రిష్టంగా 12 డిపాజిట్ల‌కు అనుమ‌తి. మైన‌ర్ పేరిట త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కుల స‌మ‌క్షంలో మైన‌ర్ల పేరిట ఖాతా తెర‌వొచ్చు.

నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్ (ఎన్‌పీఎస్‌):

దీర్ఘ‌కాలంపాటు పొదుపు అల‌వాటుతో ప్ర‌జ‌లు సంప‌ద సృష్టించుకోవాల‌నే స‌దుద్దేశంతో భార‌త ప్ర‌భుత్వం నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక భ‌ద్ర‌త‌కు, మార్కెట్ ఆధారిత రాబ‌డుల‌ను NPS అందించ‌గ‌ల‌దు. పింఛ‌ను నిధి నియంత్ర‌ణ‌, ప్రాధికార‌, అభివృద్ధి సంస్థ‌(PFRDA) ఈ ప‌థ‌కాన్ని నియంత్రిస్తుంది.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాక వారికి ఇవ్వాల్సిన‌ పింఛ‌ను భారీగా ఉండేది. దీన్ని ఎన్‌పీఎస్‌తో మార్చారు. ప్ర‌భుత్వ ఖ‌జానాపై భారం త‌గ్గించేందుకు రిటైర్‌మెంట్ పింఛ‌నును జ‌న‌వ‌రి 2004లో ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ ప‌థ‌కాన్ని 2009 సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభించాయి. అప్పటి నుంచి ప్ర‌భుత్వం మ‌న దేశంలోని అంద‌రు పౌరుల‌కు ఈ ప‌థ‌కాన్ని అందుబాటులో ఉంచింది. ఈ ప‌థ‌కంలో 18 నుంచి 65ఏళ్ల మ‌ధ్య వ‌య‌సులోని వారు చేర‌వ‌చ్చు. 70ఏళ్ల దాకా కొన‌సాగించ‌వ‌చ్చు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు:

ముందుగా నిర్ణ‌యించిన కాలానికి బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో కొంత సొమ్మును దాచుకుని, దానిపై వడ్డీ పొందటాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) అంటారు. ఎఫ్‌డీలపై ముందుగానే ఒక స్థిరమైన వడ్డీని నిర్ణయిస్తారు. నిల్వ ఉంచే సొమ్ము, కాల వ్యవధిని బట్టి వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లు ఉంటాయి.

వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు, సంఘాలు, క్లబ్బులు, సమితులు వారి కేవైసీ వివరాలు సమర్పించి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ప్రారంభించ వచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో సొమ్మును 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకూ పొదుపు చేసుకునేందుకు వీలుంది. ఎఫ్‌డీ లో ఉంచగల కనిష్ట మొత్తం బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు కనీస పరిమితిని రూ. 10,000 గా నిర్ధారించాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లో పొదుపుకి సాధారణంగా గరిష్ఠ పరిమితి ఉండదు.

డిపాజిట్ చేసే సమయంలో నిర్ధారించిన రాబడి పూర్తి కాలావధికి వర్తిస్తుంది. సాధారణంగా మూడు నెలల చక్ర వడ్డీ వర్తింపు ఉంటుంది. ఒక సారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లో పొదుపు చేశాక, దేశ ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్ల మార్పులు జరిగినా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పై ముందు నిర్ధారించిన వడ్డీనే వర్తిస్తుంది. సాధారణంగా సీనియర్‌ సిటిజన్లకు .5 శాతం వరకూ అధిక వడ్డీని చెల్లిస్తారు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలపై బ్యాంకులు రుణ సదుపాయాన్ని, ఓవర్‌డ్రాఫ్ట్‌ రూపంలో కల్పిస్తాయి. కాల పరిమితి కన్నా ముందుగా సొమ్మును విత్ డ్రా చేస్తే, బ్యాంకులు పెనాలిటీ విధిస్తాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ వడ్డీపై పన్ను, వ్యక్తికి వర్తించే పన్ను శ్లాబుని అనుసరించి ఉంటుంది. పదివేల లోపు ఆదాయంపై మూలం వద్ద పన్ను (TDS) వర్తించదు. పదివేల పైన ఆదాయం పై 10% TDS విధిస్తారు. TDS నుంచి మినహాయింపు పొందాలంటే ఫారం 15G / 15H బ్యాంకుకు సమర్పించవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని