Jio - HBO: త్వరలో జియో సినిమా యాప్‌లో హెచ్‌బీఓ కంటెంట్‌

రిలయన్స్‌ (Reliance)కు చెందిన స్ట్రీమింగ్ వేదిక జియో సినిమా (Jio Cinema) యాప్‌ త్వరలో పెద్ద ఎత్తున్న వీడియో కంటెంట్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్ (Warners Bros)తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. 

Updated : 27 Apr 2023 17:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హాలీవుడ్ సూపర్‌హిట్‌ సిరీస్‌లు గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌,  సక్సెషన్‌ అభిమానులకు శుభవార్త. త్వరలో వార్నర్‌ బ్రదర్స్‌ (Warner Bro), హెచ్‌బీఓ (HBO) సూపర్‌హిట్‌ సిరీస్‌లు తిరిగి భారత్‌లో వీక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్మాణ సంస్థకు చెందిన వీడియో కంటెంట్‌ రిలయన్స్‌ (Reliance)కు చెందిన స్ట్రీమింగ్ వేదిక జియో సినిమా (Jio Cinema) యాప్‌లో ప్రసారం కానున్నాయి. ఈ మేరకు వార్నర్‌ బ్రదర్స్‌తో రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 (Viacom 18) సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు సంస్థ ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. త్వరలోనే ఈ ఒప్పందంపై ఆయా సంస్థలు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. 

ఈ ఒప్పందం ద్వారా లక్షల గంటలకు పైగా అందుబాటులో ఉన్న టీవీ షోలు, సినిమాలు, ప్రధాన స్పోర్ట్స్‌ ఈవెంట్లు జియో సినిమా యాప్‌లో వీక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌ల ఉచిత ప్రసారం, ఫిఫా ప్రపంచకప్‌ 2022 ప్రసారాలతో ఇప్పటికే జియో సినిమా యాప్‌ భారత్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇకపై వార్నర్‌ బ్రదర్స్‌, హెచ్‌బీవో కంటెంట్‌తో ఇతర స్ట్రీమింగ్‌ వేదికలకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంస్థ 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

గతంలో వార్నర్‌ బ్రదర్స్‌, హెచ్‌బీవోకు చెందిన టీవీ షోలు, సినిమాలు డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) ఓటీటీ వేదికగా భారత్‌లో యూజర్లకు అందుబాటులో ఉండేది. ఈ ఏడాది మార్చి 31 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌ వీటి ప్రసారాలను నిలిపివేసింది. తాజాగా ఈ కంటెంట్‌ను ప్రసారం చేసేందుకు వార్నర్‌ బ్రదర్స్‌తో రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ ఖరీదు ఎంతనేది తెలియాల్సివుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని