Crude Oil: మండుతున్న చమురు ధరలు.. ఫలించని కట్టడి వ్యూహాలు!

ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ కొనసాగుతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ధరల కట్టడికి అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఫలితం మాత్ర లేకపోవడం గమనార్హం...

Published : 02 Mar 2022 11:09 IST

న్యూయార్క్‌: ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ కొనసాగుతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ధరల కట్టడికి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాలతో కలిసి వ్యూహాత్మక నిల్వ కేంద్రాల నుంచి దాదాపు మూడు కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. తన తొలి ‘స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌’ ప్రసంగంలో మంగళవారం బైడెన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

రష్యాపై తాము విధించిన ఆంక్షల ప్రభావం కేవలం ఆ దేశంపై మాత్రమే ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని బైడెన్‌ హామీ ఇచ్చారు. అందుకు తమ వద్ద ఉన్న అన్ని సాధనాలను వినియోగించుకుంటామని తెలిపారు. అమెరికా వ్యాపారాలు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చారు. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. చమురు, గ్యాస్‌ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.

అయినా, పెరుగుదల ఆగలేదు...

ధరల కట్టడికి అమెరికా సహా ఇతర  దేశాలు చర్యలు ప్రకటించినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం చమురు ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. ఉదయం బ్యారెల్‌ చమురుపై ఐదు డాలర్ల మేర పెరిగింది. న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్ఛేంజీ ప్రకారం.. బెంచ్‌మార్క్‌ యూఎల్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 5.24 డాలర్లు పెరిగి 108.60 డాలర్లకు చేరింది. మన దేశంలో ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌పై 5.43 డాలర్లు ఎగబాకి 110.40 డాలర్లకు పెరిగింది. ‘ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ’లోని 31 దేశాలు 60 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వ్యూహాత్మక నిల్వల నుంచి విడుదల చేసేందుకు అంగీకరించాయి. ధరల కట్టడి నిమిత్తమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించాయి. కానీ, మార్కెట్లు దీన్ని ప్రతికూల ధోరణిలో తీసుకున్నాయి. నిల్వల విడుదలతో రష్యా నుంచి సరఫరా దెబ్బతింటుందన్న విషయం స్పష్టమైందని మార్కెట్‌ వర్గాలు భావించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని