Ola Electric: జీరో డౌన్‌పేమెంట్‌తో ఓలా విద్యుత్‌ స్కూటర్‌

Ola Electric: విద్యుత్ ద్విచక్ర వాహన కొనుగోలుదార్ల కోసం మెరుగైన ఫైనాన్సింగ్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్షియల్‌ సంస్థలతో జట్టు కట్టింది.

Updated : 17 Jun 2023 19:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఫేమ్-2 సబ్సిడీలో కేంద్రం కోత పెట్టడంతో విద్యుత్‌ ద్విచక్ర వాహన ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఈవీల కొనుగోళ్లపై వినియోగదారుల నుంచి ఆసక్తి మందగించింది. సేల్స్‌పై ఈ ప్రభావం పడకుండా కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆకర్షణీయ వడ్డీ రేట్లకే ఫైనాన్సింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల ఏథర్‌ ఎనర్జీ (Ather Energy) 60 నెలల లోన్‌ స్కీమ్‌ను తీసుకురాగా.. ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) సైతం అదే మార్గాన్ని అనుసరిస్తోంది.

తన ఎస్‌1 శ్రేణి వాహన విక్రయాల కోసం ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌తో ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) జట్టు కట్టింది. ఇందులో భాగంగా 60 నెలలకు లోన్‌ సదుపాయం అందిస్తుంది. ఈ రుణంపై 6.99 శాతం నుంచి వడ్డీ ప్రారంభమవుతుంది. పైగా ఎలాంటి డౌన్‌పేమెంట్‌ చెల్లించకుండానే వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ వాహనాలకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు 36 నెలలు, 48 నెలల కాలవ్యవధిపై రుణాలు అందిచేవి. 

దేశవ్యాప్తంగా ఉన్న ఓలా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లలో ఈ రుణ సదుపాయాన్ని పొందొచ్చని కంపెనీ తెలిపింది. తమ భాగస్వాములతో కలిసి అందిస్తున్న ఫైనాన్సింగ్‌ సదుపాయాల ద్వారా మార్కెట్‌లో ఓ బెంచ్‌మార్క్‌ను సృష్టించామని కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అంకుష్‌ అగర్వాల్‌ తెలిపారు. టైర్‌-1 మాత్రమే కాకుండా టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో సైతం ఈవీలు సొంతం చేసుకునేందుకు ఈ ఫైనాన్సింగ్‌ మార్గాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మరోవైపు ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ల సంఖ్యను వెయ్యికి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని