Twitter: అత్యుత్తమ సిబ్బందే మాతో ఉంటారు.. భవితపై ఆందోళన లేదు: మస్క్‌

ట్విటర్‌ భవిష్యత్‌పై తాను ఏమాత్రం ఆందోళనపడటం లేదని ఆ సంస్థ కొత్త యజమాని, టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ స్పష్టం చేశారు.

Updated : 19 Nov 2022 08:32 IST

న్యూయార్క్‌: ట్విటర్‌ భవిష్యత్‌పై తాను ఏమాత్రం ఆందోళనపడటం లేదని ఆ సంస్థ కొత్త యజమాని, టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ స్పష్టం చేశారు. అత్యుత్తమ ఉద్యోగులే తమతో ఉంటారని పేర్కొన్నారు. మస్క్‌ ఇచ్చిన గడువు అనంతరం వందల సంఖ్యలో ఉద్యోగులు కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మస్క్‌ ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. ట్విటర్‌లో కొనసాగుతారా లేదా బయటకు వెళ్లిపోతారా అని మీరే నిర్ణయించుకోవాలని ఉద్యోగులకు గురువారం సాయంత్రం గం.5.00 వరకు మస్క్‌ గడువు ఇచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. ‘మూడు నెలల పరిహార వేతనంతో బయటకు వెళ్లేందుకే వందల మంది ఉద్యోగులు నిర్ణయించుకున్నారని పేర్కొంది. అంతేకాకుండా.. మా కార్యాలయాల భవనాలను మూసివేస్తున్నామని, సోమవారం వరకు ఉద్యోగుల బ్యాడ్జ్‌ యాక్సెస్‌ కూడా ఉండదని ఇ-మెయిల్‌ ద్వారా ట్విటర్‌ ప్రకటించినట్లుగా ఆ కథనం తెలిపింది. ‘అత్యుత్తమమైన వాళ్లే ఉన్నారు. అందువల్ల నాకు ఆందోళన లేద’ని ఓ వినియోగదారుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మస్క్‌ ట్వీట్‌ చేశారు. కాగా.. ముఖ్యమైన ఉద్యోగులు కొందరు కంపెనీని వీడకుండా మస్క్‌, ఆయన సలహాదార్లు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అత్యంత తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ద్వారా ట్విటర్‌ కార్యకలాపాలు సమర్థంగా సాగుతాయా అనే దానిపై సందేహాలు ఏర్పడుతాయని న్యూయార్‌ టైమ్స్‌ కథనం వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని