Budget 2022: ప్రగతిశీల బడ్జెట్‌తో కొత్త ఆశలు, అవకాశాలు: ప్రధాని

కేంద్ర బడ్జెట్‌ ద్వారా అనేక రంగాలకు లబ్ధి కలిగిందని ప్రధాని మోదీ అన్నారు.  ప్రగతిశీల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. కిసాన్‌ డ్రోన్లు, వందేభారత్‌ రైళ్లు, డిజిటల్‌ కరెన్సీకి కేంద్ర ప్రభుత్వం...

Updated : 01 Feb 2022 17:09 IST

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. పేదల సంక్షేమమే బడ్జెట్‌లో ప్రధానంగా కనిపిస్తోందన్న ఆయన.. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు తాజా బడ్జెట్‌ ఎన్నో ఆశలు, అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. ప్రజా అనుకూల, ప్రగతిశీల బడ్జెట్‌గా ప్రధాని అభివర్ణించారు.

‘ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, నల్లా నీరు, వంట గ్యాస్‌ వంటివి తప్పకుండా ఉండాలి. తాజా బడ్జెట్‌లో ఇటువంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాం. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ఈ బడ్జెట్‌లో చర్యలు తీసుకున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీటితోపాటు రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వేకు ఈ బడ్జెట్‌ పెద్దపీట వేసిందన్న ఆయన.. మౌలిక సదుపాయాలకు ఇవి ఎంతో ఊతమిస్తాయన్నారు. కిసాన్‌ డ్రోన్లు, వందేభారత్‌ రైళ్లు, డిజిటల్‌ కరెన్సీకి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య పథకం కింద డిజిట్ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి చేస్తామన్నారు. వ్యవసాయ స్టార్టప్‌ల ప్రోత్సాహానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొండ ప్రాంత ప్రజల జీవన విధానం సులభతరానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని మోదీ వెల్లడించారు.

ఇక మధ్యతరగతి వేతన జీవులకు ఎటువంటి ప్రయోజనం లేదని విపక్షాలు చేస్తోన్న విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. సమాజంలో పేద, బలహీల వర్గాలతో పాటు యువతకు తాజా బడ్జెట్‌ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్న ఆయన.. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తాజా చర్యలు మరింత దోహదం చేస్తాయని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని