Stock Market: రెండోరోజూ కొనసాగిన లాభాలు.. నిఫ్టీ @17,379

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండోరోజైన గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన మార్కెట్లు రాణించాయి.

Published : 06 Oct 2022 15:56 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య మన సూచీలు రాణించడం గమనార్హం. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సహా దాదాపు అన్ని రంగాల్లో కొనుగోళ్లు జరిగాయి. అయితే, రూపాయి బలహీనత, రష్యాపై ఐరోపా సమాఖ్య మరిన్ని ఆంక్షల్ని ప్రకటించిన నేపథ్యంలో లాభాలు పరిమితమయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 58,314.05 వద్ద లాభాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 58,578.76 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 156.63 పాయింట్ల లాభంతో 58,222.10 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 17,379.25 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టి.. 17,428.80 వద్ద గరిష్ఠాన్ని తాకి.. చివరకు 57.50 పాయింట్లు ఎగబాకి 17,331.80 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.81.90 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 18 షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, విప్రో, ఐటీసీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర సంగతులు..

సోనీతో కుదిరిన విలీన ఒప్పందానికి సీసీఐ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ షేర్లు గురువారం రాణించాయి. ఇంట్రాడేలో ఆరు శాతం మేర లాభపడ్డ షేరు ధర చివరకు 4.59 శాతం లాభంతో రూ.280.50 వద్ద స్థిరపడింది.

అమెరికాలో సెప్టెంబరు నెలలో క్లాస్8 ట్రక్కులకు భారీ ఆర్డర్లు లభించిన నేపథ్యంలో భారత్‌ ఫోర్జ్‌ షేర్లు ఇంట్రాడేలో 8 శాతం వరకు లాభపడ్డాయి. చివరకు 7.91 శాతం లాభపడి రూ.762.95 వద్ద ముగిసింది.

సవరించిన ఎమర్జెన్సీ క్రెడిట్‌లైన్‌ గ్యారంటీ స్కీమ్‌లో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు రూ.1000 కోట్లు అందనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు ఈరోజు 8.06 శాతం లాభపడి రూ.41.55 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని