షేర్‌చాట్‌ చేతికి ఆ షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌? వాటికి గట్టి పోటీ ఇచ్చేందుకేనా?

టిక్‌టాక్‌ పుణ్యమా అని దేశంలో షార్ట్‌ వీడియో యాప్స్‌కు విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. దానిపై నిషేధంతో దేశీయ యాప్స్‌కు ఆదరణ పెరిగింది.

Published : 10 Feb 2022 18:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టిక్‌టాక్‌ పుణ్యమా అని దేశంలో షార్ట్‌ వీడియో యాప్స్‌కు విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. దానిపై నిషేధంతో దేశీయ యాప్స్‌కు ఆదరణ పెరిగింది. అయితే, వీడియో ప్లాట్‌ఫాంలకు ఉన్న క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు విదేశీ కంపెనీలైన మెటా (ఒకప్పుడు ఫేస్‌బుక్‌), యూట్యూబ్‌ సైతం... ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌ను తీసుకొచ్చాయి. దీంతో దేశీయ కంపెనీలకు వీటి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ షార్ట్‌ వీడియో వేదికల విలీనానికి తెరలేచిందని సమాచారం. దేశీయ కంపెనీ షేర్‌చాట్‌ ఎంఎక్స్‌కు చెందిన టకాటక్‌ను కొనుగోలు చేయనుందని విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఈ డీల్‌ విలువ 700 మిలియన్‌ డాలర్లు  ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని, కొన్ని రోజుల్లో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే షేర్‌చాట్‌కు MOJ పేరిట షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ ఉంది. దీనికి సుమారు 160 మిలియన్‌ యూజర్లు ఉన్నారు. మరోవైపు ఎంఎక్స్‌ టకాటక్‌ సైతం సుమారు 100 మిలియన్‌ యూజర్లను కలిగి ఉంది. ఒకవేళ ఈ విలీనం జరిగితే షేర్‌చాట్‌ చేతిలో రెండు షార్ట్‌వీడియో ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. ఈ లావాదేవీ నగదు, షేర్లు రూపంలో ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికైతే ఇరు కంపెనీలు ఈ డీల్‌పై స్పందించలేదు. ఒకవేళ ఈ డీల్‌ ఓకే అయితే విదేశీ కంపెనీలకు ఈ యాప్స్‌ గట్టి పోటీనివ్వనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని