Snapdeal IPO: స్నాప్‌డీల్‌ ఐపీఓ ఇప్పుడు లేనట్లే

Snapdeal IPO: ఈక్విటీ మార్కెట్లలో పరిస్థితులు బలహీనంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఐపీఓ ప్రణాళికల్ని పక్కనపెడుతున్నట్లు స్నాప్‌డీల్‌ ప్రకటించింది.

Published : 09 Dec 2022 15:03 IST

దిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ ఐపీఓ (Snapdeal IPO) ప్రణాళికల్ని పక్కన పెట్టేసింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1,250 కోట్ల సమీకరించాలనే నిర్ణయాన్ని ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం కంపెనీ ప్రకటించింది. ఈక్విటీ మార్కెట్‌లో పరిస్థితులు బలహీనంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

దాదాపు మూడు కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా స్నాప్‌డీల్‌ ఐపీఓ (Snapdeal IPO)కి రావాలని భావించింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబరులోనే స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. తాజాగా వాటిని ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరుతూ సెబీకి లేఖ రాసింది. కొత్త తరం సాంకేతిక కంపెనీల షేర్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐపీఓపై స్నాప్‌డీల్‌ వెనక్కి తగ్గినట్లు స్పష్టమవుతోంది. భవిష్యత్తులో తిరిగి పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనని పునఃసమీక్షిస్తామని సంస్థ తెలిపింది. అయితే, ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు.

ఒకప్పుడు దేశంలో ఇ-కామర్స్‌ రంగంలో దూసుకెళ్లిన స్నాప్‌డీల్‌.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో గట్టిపోటీ ఎదురవడంతో ప్రభ కోల్పోయింది. 2017లో ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం అయ్యేందుకు చర్చలు కూడా జరిపింది. కానీ, అవి విఫలమవడంతో స్నాప్‌డీల్‌ 2.0 వ్యూహంతో ఆర్థికంగా పరిపుష్టత సాధించేందుకు ప్రణాళికలు రచించింది. మెట్రో నగరాలు కాకుండా ఇతర ప్రాంతాలపై దృష్టి సారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని