Updated : 05 Jul 2022 09:42 IST

Stock Market Update: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న పనిచేయలేదు. ప్రస్తుతం యూఎస్‌ ఫ్యూచర్స్‌ సానుకూలంగా ఉన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 113 డాలర్ల సమీపాన చలిస్తోంది. ట్రంప్‌ హయాంలో చైనాపై విధించిన ఆర్థిక ఆంక్షల్ని బైడెన్‌ సరళతరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ ఆర్థిక మాంద్యాన్ని చవిచూసే ప్రమాదం ఉందని నొమురా అంచనా వేసింది. దేశీయంగా చూస్తే జూన్‌లో వాణిజ్య లోటు 25.6 బిలియన్‌ డాలర్ల వద్ద రికార్డు స్థాయికి చేరింది. ఇది రూపాయిపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 6.4 శాతానికి పరిమితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 272 పాయింట్ల లాభంతో 53,507 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 15,915 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.04 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క ఏషియన్‌ పెయింట్స్‌ మాత్రమే నష్టాల్లో ఉంది. పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్న వాటి జాబితాలో ఉన్నాయి.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

టైటన్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు మధ్య కాలానికి తమ ఆభరణాల విభాగానికి సానుకూలతలు ఉన్నాయని, గణనీయ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని టాటా గ్రూప్‌ సంస్థ టైటన్‌ అంచనా వేసింది. టైటన్‌ తమ ఆభరణాల విభాగాన్ని తనిష్క్‌, మియా బై తనిష్క్‌, జోయా బ్రాండ్లతో నిర్వహిస్తోంది.

జొమాటో: క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ను నిర్వహించే బ్లింక్‌ కామర్స్‌ (ఇంతకు ముందు గ్రోఫర్స్‌ ఇండియా)ను రూ.4447.48 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించినప్పటి నుంచీ జొమాటో షేరు నష్టపోతూనే ఉంది. షేరు రూ.70.50 నుంచి వరుసగా ఆరో ట్రేడింగ్‌ రోజుల్లో రూ.54.40 కి కుదేలైంది. బ్లింకిట్‌ కొనుగోలు విషయాన్ని ఆలస్యంగా బహిర్గతం చేసిందని కొంత మంది జొమాటో పెద్ద మదుపర్లు సెబీకి ఫిర్యాదు చేశారు కూడా.

టాటా మోటార్స్: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో 5 లక్షల కార్లు విక్రయించాలన్నది టాటా మోటార్స్‌ లక్ష్యమని సీఈఓ చంద్రశేఖరన్‌ వెల్లడించారు. విద్యుత్‌ వాహనాల (ఈవీలు) విక్రయాలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి లక్ష మైలురాయిని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.

టాటా పవర్‌: తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే సోలార్‌ సెల్‌ ప్లాంటుపై రూ.3,000 కోట్ల పెట్టుబడులను టాటాపవర్‌ ప్రకటించింది.

బజాజ్‌ ఆటో: ఒక్కో షేరు రూ.4,600 వద్ద షేర్ల బైబ్యాక్‌ ప్రక్రియను బజాజ్‌ ఆటో ప్రారంభించింది.

టాటా స్టీల్‌: నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ను టాటా గ్రూప్‌ సంస్థ టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌కు సోమవారం అప్పగింతతో, ఆ సంస్థ ప్రైవేటీకరణ పూర్తయిందని ఆర్థిక శాఖ వెల్లడించింది. నష్టాల్లో ఉన్న నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ను ఈ ఏడాది జనవరిలో టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌ రూ.12,100 కోట్లకు దక్కించుకుంది.

ముథూట్‌ ఫైనాన్స్‌: దేశవ్యాప్తంగా మరో 150 కొత్త శాఖలను తెరిచేందుకు ఆర్‌బీఐ అనుమతించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని