Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు.. 17,050 ఎగువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 346.37 పాయింట్ల లాభంతో 57,960.09 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 16,977.30 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,126.15 దగ్గర గరిష్ఠాన్ని, 16,940.60 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 129.00 పాయింట్లు నష్టపోయి 17,080.70 దగ్గర ముగిసింది.

Published : 29 Mar 2023 16:05 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు చివరి అరగంట వరకు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఆఖర్లో వచ్చిన కొనుగోళ్ల అండతో భారీగా పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాల వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. నేడు వీక్లీతో పాటు మార్చి నెల కాంట్రాక్టుల గడువు ముగిసిన నేపథ్యంలో సూచీలు చాలా వరకు పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. ఆఖర్లో దిగ్గజ కంపెనీల షేర్లలో వచ్చిన ర్యాలీ మార్కెట్లకు దన్నుగా నిలిచింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కూడా మార్కెట్లకు కలిసొచ్చాయి. అలీబాబా గ్రూప్‌ షేర్లు రాణించడంతో ఈరోజు ఆసియా సూచీలు లాభాల్లో ముగిశాయి. శ్రీరామ నవమి సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 57,572.08 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,124.20- 57,524.32 మధ్య ట్రేడైంది. చివరకు 346.37 పాయింట్ల లాభంతో 57,960.09 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 16,977.30 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,126.15 దగ్గర గరిష్ఠాన్ని, 16,940.60 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 129 పాయింట్లు నష్టపోయి 17,080.70 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 18 పైసలు పతనమై 82.34 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డ జాబితాలో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు మాత్రమే నష్టపోయాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

☛ భారతీ ఎయిర్‌టెల్‌ షేరు గత రెండు రోజుల్లో 3 శాతం నష్టపోయి దాదాపు ఆరు నెలల కనిష్ఠానికి చేరువైంది. రిలయన్స్‌ జియోకు పోటీగా ఇటీవల ఎయిర్‌టెల్‌ తక్కువ ధరకే అపరిమిత 5జీ డేటా ప్లాన్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీ లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. చివరకు కంపెనీ షేరు 0.46 శాతం నష్టంతో రూ.745 దగ్గర ముగిసింది.

☛ హిందూస్థాన్‌ జింక్‌ నాలుగో మధ్యంత డివిడెండ్‌ చెల్లింపులకు విధించిన రికార్డు గడువు నేటితో ముగిసింది. దీంతో కంపనీ షేరు ఈరోజు 8.96 శాతం నష్టపోయి రూ.299.35 వద్ద స్థిరపడింది. 

☛ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రతిపాదించిన దివాలా పరిష్కార ప్రణాళిక వివాదం ఓ కొలిక్కి వచ్చింది. దీంతో జీ షేరు ఈరోజు 3.07 శాతం పుంజుకొని రూ.215.20 దగ్గర ముగిసింది.  

☛ ఎస్‌ఎంఎల్‌ ఇసుజు లిమిటెడ్‌ తమ వాహన ధరల్ని ఏప్రిల్‌ 1 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 2.38 శాతం పుంజుకొని రూ.705.50 దగ్గర స్థిరపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు