Tesla: త్వరలోనే భారత్‌కు టెస్లా.. రూ.20లక్షల నుంచే ఈవీలు..!

Tesla: అతి త్వరలోనే టెస్లా భారత్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. దేశంలో తయారీ ప్లాంట్‌ కోసం చర్చలు ప్రారంభించిన ఈ సంస్థ.. రూ. 20లక్షల నుంచే ఈవీలను విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. 

Updated : 13 Jul 2023 13:45 IST

దిల్లీ: భారత మార్కెట్లోకి వీలైనంత త్వరగా అడుగుపెట్టేందుకు ఎలక్ట్రానిక్‌ కార్ల దిగ్గజం టెస్లా (Telsa) ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. దేశంలో కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పెట్టుబడి ప్రతిపాదనల కోసం భారత ప్రభుత్వంతో టెస్లా చర్చలు ప్రారంభించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఏటా ఐదు లక్షల విద్యుత్తు వాహనాల (Electric Vehicles)ను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన కార్లను ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని దేశాలకు భారత్‌ నుంచే ఎగుమతి చేయాలని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కంపెనీ ప్రణాళికలు చేస్తోందట. ఈ మేరకు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక భారత్‌లో ఈ విద్యుత్తు వాహనాల (EV) ప్రారంభ ధర రూ.20లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై టెస్లా (Tesla) గానీ, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు.

గత నెల ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆయనతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మస్క్‌ మాట్లాడుతూ.. భారత్‌లో టెస్లా (Tesla) కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమవుతాయని, త్వరలోనే దీనిపై ప్రకటన ఉండే అవకాశముందని తెలిపారు. ఈ భేటీ తర్వాతే భారత్‌ ప్రభుత్వంతో టెస్లా సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది.

భారత మార్కెట్లోకి (Indian Market) టెస్లా ప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే, భారత్‌లోకి దిగుమతి చేసుకునే విలాసవంతమైన కార్లపై ప్రభుత్వం భారీ ఎత్తున సుంకం విధిస్తోంది. ‘కాస్ట్‌ ఇన్సూరెన్స్‌ ఫ్రెయిట్‌’ విలువ 40,000 డాలర్లు దాటిన కార్లపై 100 శాతం సుంకం వర్తిస్తోంది. టెస్లా (Tesla) మోడళ్లన్నీ దాదాపు ఈ కేటగిరీలోకే వస్తున్నాయి. దీంతో పన్నులను తగ్గించాలని టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇక్కడి ప్రభుత్వాన్ని కోరారు. తర్వాత విక్రయాల తీరును బట్టి స్థానికంగా తయారీపై ఆలోచిస్తామని తెలిపారు.

దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. ఇతర వాహన తయారీ సంస్థల తరహాలోనే టెస్లాను సైతం పరిగణిస్తామని తేల్చి చెప్పింది. భారత్‌లోనే తయారీని చేపట్టడం వల్ల ఖర్చు చాలా తగ్గుతుందని.. అప్పుడు కార్లకు డిమాండ్‌ ఉంటుందని చెప్పింది. కనీసం విడి భాగాలుగా తీసుకొచ్చి భారత్‌లో అసెంబుల్‌ చేసే విధానం (CKD)పైనైనా దృష్టి సారించాలని టెస్లా (Tesla)కు భారత ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలోనే గతంలో కొంతకాలం పాటు ఈ ప్రణాళికలను టెస్లా నిలిపివేయగా.. ఈ ఏడాది నుంచి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని