Omicron: ఐదు రోజుల్లో 12వేల విమానాలు రద్దు!

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది పౌర విమానయాన రంగం పరిస్థితి.

Updated : 28 Dec 2021 15:19 IST

పౌరవిమానయాన రంగానికి మళ్లీ కష్టాలు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది పౌర విమానయాన రంగం పరిస్థితి. ఇప్పటికే కరోనా నేపథ్యంలో విమానయానరంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నష్టాలను ఓర్చి.. ఈ మధ్యే అంతర్జాతీయ విమాన సేవలు తిరిగి గాడిన పడుతున్న వేళ ఒమిక్రాన్ రూపంలో మరో గండం ఎదురైంది. ఈ కరోనా కొత్త వేరియంట్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో అనేక దేశాలు విమానప్రయాణాలపై ఆంక్షలు, నిషేధం విధిస్తున్నాయి. మరోవైపు ప్రజలు సైతం ఒమిక్రాన్‌కు భయపడి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో అనేక విమాన ప్రయాణాలు రద్దు అవుతున్నాయి. క్రిస్మస్‌ వేడుకలున్నా.. గత శుక్రవారం నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 12వేల విమానాలు రద్దయినట్లు ‘ఫ్లైయిట్‌అవేర్‌’ అనే సంస్థ వెల్లడించింది. 

ఇవే కాదు.. ఇంకా వేలకొద్ది విమానాలు రద్దయ్యే అవకాశాలున్నాయని, మరికొన్ని వాయిదా పడనున్నాయని ఫ్లైయిట్‌ అవేర్‌ పేర్కొంది. సోమవారం ఒక్క రోజే 3 వేల విమానాలు రద్దు కాగా.. మంగళవారం వెయ్యికిపైగా విమాన ప్రయాణాలు రద్దయినట్లు తెలిపింది. ఒమిక్రాన్‌ విజృంభిస్తోన్న వేళ విమానాశ్రయ సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు విముఖుత చూపుతున్నారట. ఇదీ విమాన సేవల రద్దుకు ఒక కారణమని తెలుస్తోంది. కొత్త సంవత్సరం వేడుకలు విదేశాల్లో జరుపుకోవాలని చాలామంది భావిస్తారు. దీంతో ఏటా డిసెంబర్‌ చివరివారంలో విమానాలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతుండేవి. కానీ.. ఒమిక్రాన్‌ భయాందోళనలతో మళ్లీ విమానయాన రంగం కష్టాల్లోకి జారుకుంటోంది.

కొన్ని దేశాలు ప్రయాణికులను అనుమతిస్తున్నా.. వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేదా కరోనా నెగెటివ్‌ రిపోర్టు కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అలాగే, మరికొన్ని దేశాలు మళ్లీ క్వారంటైన్‌ను అమలు చేస్తున్నాయి. అమెరికాకు వచ్చే ప్రయాణికులు కనీసం 5 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తోంది.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని