Vande Bharat: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు వందే భారత్‌ మెట్రోకు వ్యత్యాసమేంటి?

Vande Bharat- Vande Metro: వేగవంతమైన రైళ్లు అందిచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్‌ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టింది. కొత్తగా వందే భారత్‌ మెట్రోలను కూడా తీసుకొస్తోంది. ఇంతకీ వీటి మధ్య వ్యత్యాసమేంటి?

Updated : 19 Apr 2023 12:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోని ప్రజలకు అత్యాధునిక వసతులతో కూడిన వేగవంతమైన రైళ్లు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను (Vande Bharat Express) ప్రవేశపెట్టింది. ఈ సెమీ హైస్పీడ్‌ రైళ్లు ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు  విస్తరిస్తున్నాయి. రోజుల వ్యవధిలో కొత్త కొత్త రూట్లలో ప్రారంభానికి నోచుకుంటున్నాయి. అదే సమయంలో సమీప ప్రాంతాలకు వేగంగా రాకపోకలు సాగించడం కోసం వందే భారత్‌ మినీ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. అదే వందే భారత్‌ మెట్రో (Vande Bharat metro). దీన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో తీసుకురానున్నారు. నగరాల నుంచి సమీప ప్రాంతాలకు వేగంగా రాకపోకలు కొనసాగించటానికి ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. విద్యార్థులకు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు సులువుగా, వేగంగా చేరుకోవడానికి వందే భారత్‌ మెట్రోలు ఉపయోగపడతాయని కేంద్రం చెబుతోంది. ఈ రెండూ వేగవంతమైన రైళ్లే అయినప్పటికే వీటి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అవేంటంటే..?

🚇 పెద్ద పెద్ద నగరాల మధ్య ప్రయాణానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను (Vande Bharat Express) అందుబాటులోకి తెస్తున్నారు. సగటున 500-600 కిలోమీటర్లు దూరం ఉన్న నగరాల మధ్య కొన్ని ప్రధాన పట్టణాలను కలుపుతూ ఇవి నడుస్తున్నాయి. స్లీపర్‌ క్లాస్‌ లేకపోవడంతో రాత్రి ప్రయాణాలతో పాటు సుదూర ప్రయాణాలకు వీటిని వినియోగించడం లేదు. అదే వందే భారత్‌ మెట్రోలయితే (Vande Bharat metro) 100 కిలోమీటర్లలోపు ఉన్న ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తాయి.

🚇 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రెండు నగరాల మధ్య రెండు సర్వీసులు మాత్రమే నడుస్తాయి. ఉదాహరణకు విశాఖ-సికింద్రాబాద్‌ వందే భారత్‌నే తీసుకుంటే ఒకటే రైలు విశాఖ నుంచి బయల్దేరి మళ్లీ.. తిరిగి రాత్రికి విశాఖకు చేరుకుంటుంది. వందే భారత్‌ మెట్రో మాత్రం ఆయా ప్రాంతాల మధ్య రోజుకు సగటున నాలుగైదు సర్వీసులు నడుస్తుంది.

🚇 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో ఛైర్‌ కార్‌ వేరేగా.. ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ వేరేగా ఉంటుంది. అదే వందే భారత్‌ మెట్రోలో అయితే కేవలం ఎనిమిది కోచ్‌లు మాత్రమే ఉంటాయి.

🚇 వందే భారత్‌ రైళ్లు గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ట్రాకుల సామర్థ్యం దృష్ట్యా ప్రస్తుతం 130 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు. వందే మెట్రో రైళ్లు సైతం 125 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు.

🚇 సుదూర ప్రాంతాలకు వెళ్తాయి కాబట్టి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బాత్‌రూమ్‌ సౌకర్యం ఉంటుంది. వందే మెట్రోలో అలాంటి సౌకర్యాలు ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని