Vibhor Steel Tubes IPO: విభోర్‌ స్టీల్ ట్యూబ్స్‌ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే

Vibhor Steel Tubes IPO: రూ.72.17 కోట్ల సమీకరణ లక్ష్యంతో విభోర్‌ స్టీల్ ట్యూబ్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ ప్రారంభమైంది.

Published : 13 Feb 2024 12:19 IST

Vibhor Steel Tubes IPO | ముంబయి: స్టీల్‌ పైపులు, ట్యూబుల తయారీ సంస్థ విభోర్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ (IPO) ఈరోజు ప్రారంభమైంది. ఫిబ్రవరి 15 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. షేర్ల ధరల శ్రేణి రూ.141-151. రిటైల్‌ మదుపర్లు కనీసం రూ.14,949తో 99 షేర్లు (ఒక లాట్‌) సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్ఠ ధర వద్ద కంపెనీకి రూ.72.17 కోట్లు సమకూరనున్నాయి.

ఐపీఓ (Vibhor Steel Tubes IPO) ద్వారా సమీకరించిన నిధులను నిర్వహణ మూలధనం, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు విభోర్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ తెలిపింది. పబ్లిక్‌ ఇష్యూలో అందుబాటులో ఉన్న షేర్లలో 50 శాతం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు (QIBs), 35 శాతం రిటైల్‌ మదుపర్లు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు (NIIs) కేటాయించారు. 2003లో ఈ కంపెనీని స్థాపించారు. భారీ ఇంజినీరింగ్‌ పరిశ్రమల్లో ఉపయోగించే అత్యున్నత నాణ్యత కలిగిన స్టీల్‌ ట్యూబులు, పైపులను తయారు చేస్తుంటుంది. చమురు, నీరు, గ్యాస్‌ సరఫరా చేసే వాటితో పాటు వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే పైపులను తయారుచేస్తుంది. రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసే లోహపు బ్యారియర్లను సైతం తయారు చేస్తుంది. జిందాల్ పైప్స్‌ ఈ కంపెనీ ప్రధాన కస్టమర్లలో ఒకటి.

2022-23 ఆర్థిక సంవత్సరంలో విభోర్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ ఆదాయం రూ.1,113 కోట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన 36 శాతం పెరిగింది. లాభం రెండింతలకు పైగా పుంజుకొని రూ.21.06 కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని