Digisaathi: డిజిట‌ల్ పేమెంట్స్ గురించి సందేహాలా..? డిజీ సాథీ ఉందిగా..

డిజిటల్ చెల్లింపుల‌కు సంబంధించిన‌ వస్తు, సేవల గురించి 24 గంటలూ సమాచారం ఇచ్చే హాట్‌లైన్ డిజిసాతి.

Updated : 04 Jun 2022 14:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఇటీవ‌లే డిజీ సాథీ స‌ర్వీసుల‌ను ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపుల‌కు సంబంధించిన‌ వస్తు, సేవల గురించి 24 గంటలూ సమాచారం ఇచ్చే హాట్‌లైన్ ఇది. ఈ ప్లాట్‌ఫారంను ఎన్‌పీసీఐ (నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా) ఏర్పాటుచేసింది. నిర్వహణ, నియంత్రణ బాధ్యతలను కూడా చూస్తోంది. భారతీయ చెల్లింపుల పరిశ్రమ అభివృద్ధికి  సాయంపడడంలో భాగంగా.. చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్లు, భాగస్వామ్య సంస్థలు (బ్యాంకులు, నాన్-బ్యాంకులు) తరపున ఎన్‌పీసీఐ ద్వారా డిజీ సాథీ ప్లాట్‌ ఫారం ఏర్పాటు చేశారు. బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు www.digisaathi.info ద్వారా గానీ, చాట్ బాట్ ద్వారా గానీ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. వాట్సాప్ ద్వారా +91 892 891 3333 నంబ‌రుకు మేసేజ్ చేసి గానీ 14431, 1800 891 3333 టోల్ ఫ్రీ నంబ‌ర్ల‌కు కాల్ చేసి గానీ మీ సందేహాలు నివృత్తి చేసుకోవ‌చ్చు. ఈ సేవ‌లు 24x7 అందుబాటులో ఉంటాయి.

ఈ సేవ‌లు ప్ర‌స్తుతం ఆంగ్ల భాష‌తో పాటు హిందీలో కూడా అందుబాటులో ఉన్నాయి. త్వ‌ర‌లోనే స్థానిక భాష‌ల్లో కూడా సేవ‌లు అందించే దిశ‌గా ప‌నిచేస్తున్న‌ట్లు ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. ఈ ప్లాట్‌ఫాం కృత్రిమ మేధ‌స్సు(ఏఐ) ద్వారా ప‌నిచేస్తుంది. కాబ‌ట్టి, కచ్చిత‌మైన స‌మాచారాన్ని ఇచ్చేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగుప‌రుస్తూనే ఉంటారు.

ఎలాంటి స‌మాచారం పొందొచ్చు?
కార్డులు (డెబిట్‌/క్రెడిట్‌/ప్రీపెయిడ్‌) - పీఓఎస్/ఈకామ్‌, యూపీఐ, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌, ఐఎంపీఎస్‌, ఏఇపీఎస్‌, ఎన్ఈటీసీ, బీబీపీఎస్‌, యూఎస్ఎస్‌డీ, పీపీఐ వ్యాలెట్స్‌, ఏటీఎమ్‌, క్యూర్ (యూపీఐ/భార‌త్‌పే), సీటీఎస్‌, ఎమ్‌టీఎస్ఎస్‌, టీఆర్ఇడీఎస్‌, ఎన్ఏసీహెచ్‌, మొబైల్‌, నెట్ బ్యాంకింగ్ స‌ర్వీసుల వంటి వివిధ ర‌కాల ప్రొడెక్టులు, స‌ర్వీసుల‌కు సంబంధించి స‌మాచారాన్ని అందిస్తుంది. 
 
డిజీ సాథీ వెబ్‌సైట్ ఇంట‌ర్ఫేస్‌ ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల్లో ఉంటుంది. వినియోగ‌దారుడు సుల‌భంగా యాక్సెస్ చేసే విధంగా వెబ్‌సైట్‌ని డిజైన్ చేశారు. ఏదైనా డిజిట‌ల్ చెల్లింపు ఉత్ప‌త్తి, సేవ‌ల గురించిన స‌మాచారంతో పాటు నిర్దిష్ట ప్రాడక్ట్‌, స‌ర్వీసును ఏవిధంగా పొందాలి? ఎలా వినియోగించుకోవాలో కూడా త‌గిన సూచ‌న‌లు చేస్తుంది. లావాదేవీల‌కు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసేందుకు సంబంధిత‌ బ్యాంకు/సంస్థ కాంటాక్ట్‌ వివ‌రాల‌ను అందిస్తుంది.

ఏవిధంగా ప‌నిచేస్తుంది?

  • డిజీ సాథీ వెబ్‌సైట్‌ని ఈ లింక్ ద్వారా ఓపెన్ చేయ‌వ‌చ్చు.
  • ముందుగా మీకు కావాల్సిన భాష (ఇంగ్లీష్‌/హిందీ)ని ఎంచుకోండి. ఈ ఆప్ష‌న్ స్క్రీన్‌కి కుడివైపున పై భాగంలో క‌నిపిస్తుంది.
  • స్కీన్ మ‌ధ్య‌లో సెర్చ్ బార్ క‌నిపిస్తుంది. అక్క‌డ మీ ప్ర‌శ్న‌ని టైప్ చేయ‌వ‌చ్చు. లేదా అక్క‌డే ఉన్న స్పీకర్‌ బ‌ట‌న్ క్లిక్ చేసి వాయిస్ రూపంలోనూ స‌మాచారం కోర‌వ‌చ్చు. (సెర్చ్‌ బార్‌లో టైప్ యువర్‌ క్వయరీ అని సూచ‌న వ‌స్తుంటుంది).
  • మీరు మీ ప్ర‌శ్న టైప్ చేస్తున్న‌ప్పుడు.. దానికి సంబంధించిన ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను ఆటేమేటిక్‌గా సూచిస్తుంటుంది.
  • ఈ ప్ర‌శ్న‌ల‌ను క్లిక్ చేయ‌డం ద్వారా మ‌రింత స‌మాచారం పొంద‌వ‌చ్చు.

డిజీ సాథీలో ఎస్‌పీసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, వీసా, మాస్టర్ కార్డ్‌, జీ పే, అమెజాన్ పే, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేష‌న్‌, మ‌రికొన్ని సంస్థ‌లు భాగ‌స్వాములుగా ఉన్నాయి. బ్యాంకుకు సేవా అభ్య‌ర్థ‌న పంప‌డానికి లేదా మోస‌పూరిత లావాదేవీల గురించి బ్యాంకుకి ఫిర్యాదు చేసేందుకు బ్యాంకు/ఆర్థిక సంస్థ‌కు సంబంధించిన సంప్ర‌దింపు వివ‌రాలు, ఈ-మెయిల్ ఐడీల‌ను ఇక్క‌డ పొంద‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని