Term Insurance: ట‌ర్మ్ పాల‌సీ ఎప్పుడు తీసుకోకూడదు?

వ్య‌క్తి ఆక‌స్మికంగా మ‌ర‌ణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక మ‌ద్ద‌తు ల‌భించాల‌నే ఉద్దేశ్యంతో రూపొందించిన‌దే ట‌ర్మ్ బీమా. 

Published : 07 Feb 2022 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవిత బీమా అనగానే ఇప్పుడు అందరూ సూచించేది టర్మ్‌ పాలసీనే. అది కూడా ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవాలని చాలా మంది నిపుణులు చెబుతుంటారు. దీని వల్ల తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్‌ పొందొచ్చు. ధూమ‌పానం వంటి అల‌వాట్లు లేని 30 సంవ‌త్సరాల వ్యక్తి నెల‌కు రూ.800 నుంచి రూ.1000 ప్రీమియంతో ట‌ర్మ్ బీమాను తీసుకోవ‌చ్చు. ఇద్దరు వ్యక్తులు ఒకసారి రెస్టారెంట్‌కు వెళితే అయ్యే ఖర్చు కంటే ఇది తక్కువే. ఒక‌వేళ‌ అంత‌కంటే చిన్న వ‌య‌సులోనే పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియంతోనే బీమా కవరేజ్‌ పొందొచ్చు. అయితే, త‌క్కువ ప్రీమియానికి లభిస్తోందని బీమా కొనుగోలు చేయడమూ సరైంది కాదు. ట‌ర్మ్‌ బీమా అవ‌స‌రం లేని సంద‌ర్భాలూ ఉండొచ్చు. అలాంటి సందర్భాలను ఇప్పుడు చూద్దాం..

ఆధారిత స‌భ్యులు, బాధ్యతలు లేనప్పుడు..
కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా మ‌ర‌ణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక మ‌ద్దతు ల‌భించాల‌నే ఉద్దేశంతో రూపొందించిన‌దే ట‌ర్మ్ బీమా. అందువ‌ల్ల ట‌ర్మ్ బీమాలో మ‌ర‌ణ ప్రయోజనం మాత్రమే లభిస్తుంది. అంటే పాల‌సీ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మ‌ర‌ణిస్తే.. హామీ ఇచ్చిన మొత్తాన్ని బీమా సంస్థ పాల‌సీదారుని నామినీ లేదా కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేస్తుంది. పాల‌సీ కాల‌ప‌రిమితి ముగిసే వరకు పాల‌సీదారుడు జీవించి ఉంటే ఏవిధ‌మైన చెల్లింపులూ చేయరు. ఈ కార‌ణంగానే కుటుంబ స‌భ్యుల ఆర్థిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా బీమా క‌వ‌రేజ్ ఉండాల‌ని నిపుణులు సూచిస్తుంటారు. ఆధారిత కుటుంబ స‌భ్యులు లేని వారికి ట‌ర్మ్ పాల‌సీ అవ‌స‌రం ఉండ‌దు. ఒక‌వేళ మీకు వివాహం కాకుండా ఉండి.. తల్లిదండ్రులు ఆర్థికంగా మీపై ఆధారపడే పరిస్థితి లేని సందర్భంలో ట‌ర్మ్ పాల‌సీని తీసుకోనవ‌స‌రం లేదు. ఒక‌వేళ మీరు ఉద్యోగి అయ్యి ఉండి పిల్లలుంటే ట‌ర్మ్ పాల‌సీ త‌ప్పకుండా తీసుకోవాలి. వార్షిక ఆదాయానికి క‌నీసం 15-20 రెట్లు అధికంగా క‌వ‌రేజ్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీరు తీర్చాల్సిన రుణాలు (గృహ రుణం వంటివి) ఉన్నప్పుడు ట‌ర్మ్ బీమా పాల‌సీ తీసుకోవ‌డం మంచిది.

స‌రిపోయే ఆస్తులు ఉన్నప్పుడు
మీకు త‌క్కువ బాధ్యతలు ఉండి స్థిరాస్తులు ఎక్కువ‌గా ఉన్నప్పుడు కూడా జీవిత బీమాను పక్కన పెట్టొచ్చు. కానీ ఈ లెక్కలు జాగ్రత్తగా వేయాలి. మీ స్థిర‌, చరాస్తుల నుంచి వ‌చ్చే ఆదాయం నుంచి ముందుగా చెల్లించాల్సిన రుణాల‌ను తీసివేయాలి. మిగిలిన ఆదాయ మొత్తం కుటుంబంలోని సంపాదించే వ్యక్తి ఆదాయం కంటే ఎక్కువ ఉండాలి. అలాగే, భ‌విష్యత్‌ ఆర్థిక లక్ష్యాలు (పిల్లల చదువు, వివాహం, జీవిత భాగ‌స్వామి రిటైర్‌మెంట్ త‌ర్వాతి ఖ‌ర్చులు)కు అవ‌స‌ర‌మైన మొత్తాన్ని ముందే స‌మ‌కూర్చుకుని ఉండాలి. ఇలా అన్ని ఆర్థిక అవ‌స‌రాల‌కు స‌రిపోయే మొత్తం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ప‌రిగ‌ణించాలి. లేదంటే ట‌ర్మ్ బీమాను తప్పనిసరిగా తీసుకోవాలి.

పన్ను ఆదా కోసమే అయితే వద్దు
టర్మ్ పాలసీకి చెల్లించిన ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ వార్షిక ప్రీమియం.. హామీ మొత్తంలో 10 శాతం మించకుండా ఉంటే ప‌న్ను ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, ఇందుకోసం ఆర్థిక సంవ‌త్సరం చివర్లో తొంద‌ర‌లో ఇత‌ర విష‌యాల‌ను తెలుసుకోకుండా కేవ‌లం ప‌న్ను మిన‌హాయింపు కోసం మాత్రమే జీవిత బీమా కొనుగోలు చేసేస్తుంటారు. పీపీఎఫ్‌, ఈఎల్ఎస్ఎస్‌, గృహ రుణం వంటి వాటికి కూడా సెక్షన్‌ 80సి కింద ల‌భించే మిన‌హాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. కేవ‌లం ప‌న్ను ఆదా కోసమే బీమాను కొనుగోలు చేయ‌కూడ‌దు. మీ కుటుంబ ఆర్థిక అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ట‌ర్మ్ బీమాను కొనుగోలు చేయాలి. ప‌న్ను మిన‌హాయింపు అనేది అద‌న‌పు ప్రయోజనం కింద మాత్రమే చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని