Investments: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి.. ఎప్పుడు? ఎలా?

దీర్ఘకాలానికి, అంటే పదవీ విరమణ వచ్చేటప్పటికీ ఉద్యోగులకు భారీ నిధి అవసరం. ఇంకా, అనేక కాలవ్యవధులకు మ్యూచువల్‌ ఫండ్ పెట్టుబడులు మదుపుదార్లకు ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ చూడండి.

Published : 28 Apr 2023 16:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మ్యూచువల్‌ ఫండ్లు చక్కగా ఉపయోగపడతాయి. మార్కెట్‌లో చాలా ఆప్షన్‌లు అందుబాటులో ఉండడంతో ఈ పథకాలను ఎంచుకోవడంలో పెట్టుబడిదారులు గందరగోళానికి గురవుతుంటారు. కాబట్టి, సరైన మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌ను ఎంచుకోవడంలో సహాయపడే కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఇక్కడ చర్చిద్దాం.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు రిస్క్‌ చేయగల వయసు, ఆర్థిక లక్ష్యాలు, పన్ను నిర్వహణ, ముఖ్యంగా పదవీ విరమణకు మిగిలిన ఉన్న సంవత్సరాలు మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్యోగులు అయితే, తమ నెలవారీ జీతం నుంచి డబ్బును ఆదా చేయడం ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టొచ్చు. కొంత మంది ఉద్యోగులకు కంపెనీ ద్వారా ఏకమొత్తంలో (బోనస్‌, ఇన్సెంటివ్స్‌ ద్వారా) డబ్బు అందినప్పుడు ఆ మొత్తాన్ని కూడా పెట్టుబడికి ఉపయోగించవచ్చు. అయితే, రిస్క్‌ను తగ్గించుకోవడానికి, విభిన్న ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి వారు పెట్టుబడిని వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది.

రాబడి: గణనీయమైన రాబడిని పొందడానికి పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టాలని కొంత మంది మదుపుదార్లు భావిస్తారు. మ్యూచువల్‌ ఫండ్ల విషయంలో అది నిజం కాదు. మీరు ‘సిప్‌’ల ద్వారా ప్రతి నెలా రూ.500 కూడా పెట్టుబడి పెట్టొచ్చు. మ్యూచువల్‌ ఫండ్లలో రాబడి చూసుకుంటే ఉదా: నెలకు రూ.2,000 చొప్పున 12% వార్షిక రాబడి చొప్పున 20 సంవత్సరాలు మదుపు చేస్తే, దాదాపు రూ.20 లక్షల మొత్తం జమవుతుంది.

అత్యవసర నిధి: నెల నెలా ఆదాయం పొందేవారు తమ ఉపాధిలో అనిశ్చితి పరిస్థితులు ఏర్పడినప్పుడు కలిగే ఆర్థిక సవాళ్లను ఎదుర్కోడానికి అత్యవసర నిధి అవసరం. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో అధిక లిక్విడిటీని కలిగి ఉండడం చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఈ నిధిని సమకూర్చుకోవడానికి స్వల్పకాలిక డెట్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. వేగవంతమైన లిక్విడిటీకి.. లిక్విడ్‌ ఫండ్స్‌, అల్ట్రా-షార్ట్‌ డ్యూరేషన్‌ మ్యూచువల్‌ పండ్లు వంటి స్వల్పకాలిక డెట్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. వీటిలో చాలా తక్కువ రిస్క్‌ను కలిగి ఉండడమే కాకుండా ఎటువంటి ఇబ్బందీ లేకుండా అత్యవసర పరిస్థితుల్లో త్వరగా డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి వీలు ఉంటుంది.

సంపద సృష్టికి: దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. మీరు రిస్క్‌ ఉన్నాసరే అధిక రాబడిని పొందాలనుకుంటే.. స్మాల్‌, మిడ్‌-క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. మరోవైపు ఒక మోస్తరు రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే.. లార్జ్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇక్కడ ముఖ్య సూత్రం ఏమిటంటే మీ మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడి పెరగడానికి ఎక్కువ సమయం ఇవ్వండి. దీర్ఘకాలానికి, అంటే మీ పదవీ విరమణ దగ్గరికొచ్చేసరికి మీ ఆర్థిక బాధ్యతలు పెరుగుతాయి. అటువంటి సమయంలో తక్కువ రిస్క్‌ కలిగిన లార్జ్‌-క్యాప్‌ ఫండ్‌ వంటి మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లకు పెట్టుబడులను మరల్చాలి. 

చివరిగా: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌కు లోబడి ఉంటాయి. ఒక్కోసారి నష్టాలూ రావచ్చు. కాబట్టి, రిస్క్ తీసుకోలేని వారు బ్యాంకు డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ పథకాల్లో మదుపు చేయడం మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని