Rishad Premji: సగం వేతనమే అందుకున్న రిషద్‌ ప్రేమ్‌జీ.. ఎందుకంటే?

Rishad Premji: విప్రో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ వేతనం విధ కారణాల రీత్యా ఈ ఏడాది సగానికి తగ్గింది.

Published : 25 May 2023 17:26 IST

దిల్లీ: విప్రో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ (Rishad Premji) గత ఆర్థిక సంవత్సరం సగం వేతనమే అందుకున్నారు. 2021- 22లో ఆయన 18,19,022 డాలర్లు వేతనంగా పొందారు. అది 2022- 23లో 8,67,669 డాలర్లకు తగ్గడం గమనార్హం.

యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సమర్పించిన వివరాల ప్రకారం.. రిషద్‌ (Rishad Premji)కు అందిన పరిహారంలో 8,61,620 డాలర్లు వేతనం, అలవెన్సులు కాగా.. 74,343 డాలర్లు దీర్ఘకాల పరిహార ప్రయోజనాలు, 15,390 డాలర్లు ఇతర ఆదాయాల కింద పొందారు. వేతనంలో క్యాష్‌ బోనస్‌ కూడా ఉంది. అయితే ఆయనకు గత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి స్టాక్‌ ఆప్షన్లను జారీ చేయలేదు.

కంపెనీ ఇంక్రిమెంటల్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభాల్లో ఏటా రిషద్‌కు 0.35 శాతం కమీషన్‌గా అందాల్సి ఉంటుంది. కానీ, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అది నెగెటివ్‌గా నమోదైంది. మరోవైపు ఉద్యోగులకు ఇచ్చే పరిహారం పెరగడం వల్ల ఐటీ సర్వీసెస్‌ నుంచి వచ్చే ఆదాయంలో స్థూల లాభాల శాతం సైతం తగ్గినట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో సగం వేతనం మాత్రమే తీసుకోవడానికి రిషద్‌ స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు సమాచారం.

2007లో రిషద్‌ ప్రేమ్‌జీ (Rishad Premji) విప్రోలో చేరారు. వివిధ హోదాల్లో పనిచేస్తూ 2019లో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా పదోన్నతి పొందారు. విప్రో బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వ్యాపారానికి జనరల్‌ మేనేజర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత ఇన్వెస్టర్‌ రిలేషన్స్‌ విభాగాధిపతిగా పనిచేశారు. అలాగే కొనుగోళ్లు- విలీనాలు, వ్యూహాల బృందానికి నేతృత్వం వహించారు. చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా విప్రో వెంచర్స్‌కు రూపకల్పన చేశారు. విప్రో తర్వాతి తరం వ్యాపారాలకు దోహదం చేసే టెక్నాలజీ, పరిష్కారాలను అభివృద్ధి చేసే స్టార్టప్‌ల కోసం 250 మిలియన్‌ డాలర్ల నిధిని ఏర్పాటు చేశారు. విప్రోలో చేరడానికి ముందు లండన్‌లో బెయిన్‌ అండ్‌ కంపెనీ, అమెరికాలో జీఈ క్యాపిటల్‌లో రిషద్‌ పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు