దోపిడీ దొంగల దాడిలో రైనా బంధువు మృతి

దోపిడీ దొంగల ముఠా చేసిన దాడిలో క్రికెటర్‌ రైనా బంధువు ఒకరు మృతిచెందారు. మరో నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి......

Published : 31 Aug 2020 00:57 IST

చండీగఢ్‌: దోపిడీ దొంగల ముఠా చేసిన దాడిలో క్రికెటర్‌ రైనా బంధువు ఒకరు మృతిచెందారు. మరో నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, బంధువు మృతి వార్త తెలుసుకుని యూఏఈ వెళ్లిన రైనా.. భారత్‌కు తిరుగు ప్రయాణమైనట్లు తెలుస్తోంది.

పంజాబ్‌లోని పఠాన్‌కోఠ్‌ జిల్లాలో థరియాల్‌ గ్రామంలో ప్రభుత్వ గుత్తేదారు అయిన అశోక్‌ కుమార్‌ (58) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి సమయంలో ముగ్గురు, నలుగురు దోపిడీ దొంగలు వీరి ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా డాబాపై నిద్రిస్తున్నారు. దొంగతనానికి వచ్చిన వారు కుటుంబసభ్యులపై దాడి జరపగా.. అశోక్‌కుమార్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన తల్లి సత్యదేవి (80), భార్య ఆశాదేవి, కుమారులు అపిన్‌, కౌశల్‌ గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన అశోక్‌ కుమార్‌ మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. సత్యదేవి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. కొంత నగదు, బంగారం దొంగిలించుకుపోయారని, దుండగుల కోసం గాలిస్తున్నామని సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ గుల్నీత్‌ సింగ్‌ ఖురానా తెలిపారు.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడేందుకు యూఏఈ వెళ్లిన రైనా.. భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. రైనా ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఆడడం లేదని ఆ జట్టు సీఈవో విశ్వనాథన్‌ ఈ ఉదయం ట్వీట్‌ చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఇప్పటికే యూఏఈ నుంచి భారత్‌కు తిరుగు పయనమయ్యాడని చెప్పారు. అందుకు కారణాన్ని ఆయన వెల్లడించనప్పటికీ.. కారణమిదేనని తెలుస్తోంది.

\\

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని