ఫ్లెక్సీ కడుతుండగా పవన్‌ అభిమానులు మృతి

చిత్తూరు జిల్లా శాంతిపురంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతిచెందారు.

Published : 02 Sep 2020 01:46 IST

ముగ్గురు మృతి, మరో నలుగురికి గాయాలు

శాంతిపురం: చిత్తూరు జిల్లా శాంతిపురంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా ఏడోమైలు వద్ద ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు కడపల్లెకు చెందిన రాజేంద్ర (31), సోమశేఖర్‌ (29), అరుణాచలం (20)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మాటలకు అందని విషాదం: పవన్‌కల్యాణ్‌
జనసేన అభిమానుల మృతి పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘జనసైనికుల మరణం మాటలకు అందని విషాదం. రాజేంద్ర, సోమశేఖర్‌, అరుణాచలం మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతంతో మరణించారన్న వార్త ఎంతగానో కలచివేసింది. మాటలకు అందని విషాదం.. తల్లిదండ్రుల గర్భశోకం అర్థం చేసుకోగలను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను.. ఆ తల్లిదండ్రులకు నేనే బిడ్డగా నిలుస్తాను. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాను. మృతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ప్రమాద ఘటనలో మరికొందరు జనసైనికులు గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారికి సరైన వైద్య సేవలు అందేలా చూడాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

శాంతిపురం ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్థిక సాయం అందించి క్షతగాత్రులకు వైద్య సేవలు అందించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని