Drug case: ఇంట్లో డ్రగ్స్‌.. పోలీసుల భయంతో బాత్​రూమ్‌లో దాక్కున్న నటి

మాదక ద్రవ్యాల వ్యవహారం కర్ణాటకను కుదిపేస్తోంది. తాజాగా ప్రముఖ మోడల్​ సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 01 Sep 2021 01:21 IST

బెంగళూరు: మాదక ద్రవ్యాల వ్యవహారం కర్ణాటకను కుదిపేస్తోంది. ఇదివరకే కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్టు కాగా.. ఇప్పుడు ప్రముఖ మోడల్​ సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన సోదాల్లో నటి, మోడల్​, కాస్మోటిక్ వ్యాపారం నిర్వహించే సోనియా అగర్వాల్​, మరో వ్యాపారవేత్త భరత్​, డీజే వచన్​ చిన్నప్ప ఫ్లాట్లలో డ్రగ్స్​ బయటపడ్డాయి. ప్రస్తుతం వీరిని పోలీసులు విచారిస్తున్నారు. వీరందరికీ నైజీరియా డ్రగ్స్​ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సినీ రంగానికి చెందిన చాలా మందికి ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

రాజాజీనగర్​లోని సోనియా ఇంట్లో జరిపిన సోదాల్లో 40 గ్రాముల గంజాయి దొరికినట్లు సమాచారం. ఆ సమయంలో మోడల్​ ఇంట్లో లేదు. ఓ హోటల్​లో ఆమె ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లగా.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొనే ప్రయత్నం చేసింది. బాత్‌​​రూంలో దాక్కున్న ఆమెను పోలీసులు బయటకు తీసుకొచ్చారు. పోలీసుల విచారణలో నైజీరియా డ్రగ్స్​ వ్యాపారి థామస్​తో తనకు పరిచయం ఉందని సోనియా అంగీకరించింది. కొన్ని పార్టీలకు డ్రగ్స్​ సరఫరా చేసినట్లు తెలిపింది. చాలా మంది రాజకీయ నాయకులు, స్టార్​ నటీనటుల పిల్లలు, కథానాయికలతోనూ తనకు పరిచయాలున్నాయని పేర్కొంది. వ్యాపారవేత్త భరత్​, డీజే వచన్​ చిన్నప్ప ఇళ్లలోనూ డ్రగ్స్‌ బయటపడగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

సోనియా అగర్వాల్‌ అంటే.. 7/G బృందావన కాలనీ ఫేమ్‌ కాదు!

నటి, మోడల్​ సోనియా అగర్వాల్​ ఇంట్లో గంజాయి దొరికిందనగానే.. చాలా మంది 7/G బృందావన కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్​ అనుకున్నారు. పలు మీడియా సంస్థల్లో ఇలా వార్తలు కూడా వచ్చాయి. ఆ నటి ఈ వార్తలను కొట్టిపారేసింది. డ్రగ్స్​ కేసుతో తనకేం సంబంధం లేదని, ఆ ఆరోపణలతో తన కుటుంబం ఆవేదనకు గురవుతున్నట్లు పేర్కొంది. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ ఆడియో విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని