Sangam Dairy: 5గంటలకుపైగా విచారణ

గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో అరెస్టు అయిన తెదేపా సీనియర్‌ నేత, సంగం డెయిరీ మాజీ ఛైర్మన్‌ దూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను

Published : 02 May 2021 01:45 IST

విజయవాడ సబ్‌జైలుకు దూళిపాళ్ల తరలింపు

విజయవాడ: గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో అరెస్టు అయిన తెదేపా సీనియర్‌ నేత, సంగం డెయిరీ మాజీ ఛైర్మన్‌ దూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను అవినీతి నిరోధకశాఖ కస్టడీకి తీసుకుంది. ఇవాళ ఉదయం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ గొల్లపూడిలోని అనిశా కార్యాలయానికి తీసుకొచ్చారు. తదుపరి దర్యాప్తులో భాగంగా నరేంద్రను ప్రశ్నించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని అనిశా కోరింది. న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలంటూ నాలుగు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. విచారణలో భాగంగా తొలిరోజు సుమారు 5 గంటలకుపైగా అనిశా కార్యాలయంలో విచారణ జరిపారు. సంగం డెయిరీ కార్యకలాపాలు, ఛైర్మన్‌గా నరేంద్ర బాధ్యతలు ఎప్పుడు స్వీకరించారు? అంతకుముందు తన తండ్రి హయాంలో ఎన్ని సంవత్సరాలు డెయిరీ కార్యకలాపాలు సాగించింది?.. తదితర అంశాలపై తొలిరోజు ప్రాథమిక దర్యాప్తు జరిపినట్లు తెలుస్తోంది. దర్యాప్తు అనంతరం నరేంద్రను విజయవాడ సబ్‌జైలుకు తరలించారు.

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం, విజయవాడలోని గొల్లపూడి అనిశా కార్యాలయం వద్ద నరేంద్రను చూసేందుకు అతని కుటుంబ సభ్యులు, అభిమానులు తరలివచ్చారు. నరేంద్ర తల్లి ప్రమీలాదేవి, భార్య జ్యోతిర్మయి, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు నరేంద్రను చూసేందుకు వచ్చారు. కానీ ఆయన్ను కలిసేందుకు పోలీసులు వారిని అనుమతించలేదు. గంటల తరబడి బయట నిరీక్షించినా ఒక్క నిమిషం కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంగం డెయిరీ లావాదేవీలకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి తన భర్తను ఇరికించేందుకు ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నారని నరేంద్ర భార్య జ్యోతిర్మయి కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని అన్నారు. దూళిపాళ్లను కలిసేందుకు అనిశా కార్యాలయానికి అతని తరఫు న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ వెళ్లిన సమయంలోనూ పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపటి తర్వాత రామకృష్ణను పోలీసులు అనుమతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని