ఆ కేసులో సాక్ష్యం ఖరీదు రూ.7.5 కోట్లు

మహారాష్ట్రలో హత్యకు గురైన అభ్యుదయవాది నరేంద్ర దబోల్కర్‌ కేసులో ఉపయోగించిన ఆయుధాన్ని థానే సమీపంలోని సముద్రంలో 40 అడుగుల లోతు నుంచి వెలికితీసినట్లు సీబీఐ అధికారులు.....

Published : 06 Mar 2020 12:02 IST

ముంబయి: మహారాష్ట్రలో హత్యకు గురైన హేతువాది నరేంద్ర దభోల్కర్‌ కేసులో ఉపయోగించిన ఆయుధాన్ని థానే సమీపంలోని సముద్రంలోని ఇసుక పొరల్లో 40 అడుగుల లోతు నుంచి వెలికితీసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం సుమారుగా రూ.7.5 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు భరించనున్నాయి. నరేంద్ర దభోల్కర్‌ సహా హేతువాదులు గోవింద్ పన్సారే, ఎమ్‌ ఎమ్‌ కలబురిగి, గౌరీ లంకేశ్‌లు ఒకే రీతిలో హత్యలకు గురైన విషయం తెలిసిందే. వీరిలో దభోల్కర్‌ కేసును సీబీఐ విచారిస్తుండగా, పన్సారే, కలబురిగి, గౌరీ లంకేశ్‌ కేసులను కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దభోల్కర్‌ కేసులో అరెస్టయిన శరద్‌ కలాస్కర్‌ అనే షూటర్‌ హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సముద్రంలోకి విసిరేసినట్లు తెలపడంతో సీబీఐ అధికారులు వాటిని వెలికితీసే ప్రక్రియను ప్రారంభించారు.

ఇందుకోసం దుబాయ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్విటెక్‌ మెరైన్‌ కన్సల్టెంట్స్‌ అనే సంస్థ సహాయం తీసుకున్నారు. దీనిగాను ఆ సంస్థకు రూ.7.5 కోట్లు చెల్లించనున్నారు. ఇందులో భాగంగా ఎన్విటెక్ సంస్థ సౌండ్ నావిగేషన్‌, రేంజింగ్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సముద్రం లోపల ఉన్న తుపాకీని గుర్తించి, క్రేన్‌ సహాయంతో ఇసుక పైపొరను తొలగించారు. తర్వాత ఉక్రెయిన్‌కు చెందిన నిపుణులైన డైవర్లు సముద్రంలో 40 అడుగుల లోతులోకి దిగి తుపాకీని బయటకు తీశారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ తుపాకీ హత్య కేసులో కీలక సాక్ష్యంగా మారనుంది.  దాన్ని మరిన్ని పరీక్షల కోసం పంపనున్నారు. వాటి ఫలితాల ఆధారంగా అది దభోల్కర్‌ హత్యలో ఉపయోగించిందా లేదా అనే విషయం నిర్ధారణ కానుందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. అంతే కాకుండా మిగిలిన వారి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా నిందితుడు సముద్రంలో విసిరేసినట్లు తెలపడంతో వాటిని కూడా వెలికితీసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని