Crime: కత్తితో బెదిరించి చీర దొంగతనం 

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ దండగుడు కత్తి చూపించి ఖరీదైన చీర దొంగిలించాడు.

Updated : 04 Jul 2021 09:44 IST

నిందితుడిపై ‘జాతీయ భద్రతా చట్టం’ కేసు

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ దండగుడు కత్తి చూపించి ఖరీదైన చీర దొంగిలించాడు. 24 గంటల్లోపే నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతనిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదుచేశారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఉజ్జయిని టవర్‌ చౌక్‌లోని చీరల దుకాణానికి వెళ్లిన ఓ యువకుడు.. తొలుత కత్తిని చూపించి బెదిరించాడు. అడ్డుకోబోయిన వారికి పక్కకు నెట్టాడు. దుకాణంలో డబ్బు, ఇతర ఖరీదైన వస్తువులేమీ తాకకుండా కేవలం ఒక్క చీర కోసమే ఇలా చేశాడు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా దొంగతనానికి పాల్పడింది విక్కీ అనే పాత నేరస్థుడని పోలీసులు గుర్తించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 16 గంటల్లోనే పోలీసులు విక్కీని అరెస్టు చేసి ఎన్‌ఎస్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల చర్యపై విమర్శలు రావడంతో రావడంతో వివరణ ఇచ్చారు. నిందితుడిపై పలు పోలీసుస్టేషన్లలో 16 కేసులున్నాయని, గతంలో ఇలాంటి దోపిడీలు చేశాడని, అందుకే కఠినమైన చట్టం ప్రయోగించామని చెప్పారు. కాగా దుకాణంలో బయటకు కనిపించేలా ఉన్న ఎర్ర చీర తనకు అమితంగా నచ్చిందని, తన భార్యకు బహుమతిగా ఇచ్చేందుకే దాన్ని దొంగిలించానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని