Updated : 29 Apr 2022 06:49 IST

Suicide: వరకట్న వేధింపులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలి


నిఖిత పెళ్లినాటి చిత్రం

మూసాపేట, న్యూస్‌టుడే: వివాహమై పది నెలలు. వరకట్న వేధింపులు ఎక్కువై తన జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకుందో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చినా భర్త ఆగడాలు ఆగకపోవడమే కారణమని తెలుస్తోంది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణానికి చెందిన జూపల్లి శ్రీనివాసరావు కొన్నాళ్ల క్రితం తన కుటుంబంతో నగరానికి వలసొచ్చారు. కూకట్‌పల్లి బాలకృష్ణానగర్‌లోని ప్లాట్‌ నంబరు 158లో ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగి అయిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అయిన పెద్ద కుమార్తె నిఖిత (26)కు సిరిసిల్ల పట్టణానికే చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చేటి ఉదయ్‌తో గతేడాది జూన్‌ 6న వివాహం జరిపించారు.

వివాహ సమయంలో రూ.10 లక్షల నగదు, 35 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చారు. శ్రీనివాసరావుకు సొంతూరులో 4.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో సగం భూమిని తన పేరిటగానీ, తన తల్లిదండ్రుల పేరుతో గానీ రాయించాలని నిఖిత భర్త వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు శ్రీనివాసరావు సమ్మతించకపోగా తమ మరణానంతరం ఆస్తి చెందుతుందని తెగేసి చెప్పాడు. దీంతో ఉదయ్‌ తనకు అదనపు కట్నం కావాలంటూ భార్యను నిత్యం వేధించేవాడు. దీంతో శ్రీనివాసరావు ఇటీవల అల్లుడికి మరో రూ.10 లక్షలు ఇచ్చారు. అయినా ఉదయ్‌ది అదే తీరు. అత్తమామలైన అశోక్‌రావు, శ్యామల, మరిది ఉపేందర్‌ సైతం ఉదయ్‌కే వంత పాడుతుండటంతో నిఖిత ఉగాది రోజైన (ఏప్రిల్‌ 2న) కూకట్‌పల్లిలో పుట్టింటికి వచ్చింది. అయినా రోజూ ఫోన్‌లో భార్యను వేధించేవాడు.

ఒకవేళ ఫోన్‌ తీయకపోతే ఆమె సోదరి నీతకు ఫోన్‌ చేసి దూషించేవాడు. ఈనెల 20న అత్తగారింటికి వచ్చి గొడవ పడ్డాడు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో భార్యాభర్తలకు తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ సమయంలో భార్య మెడలోని మంగళసూత్రాన్ని తెంపి ఆమెను తీవ్రంగా కొట్టాడు. దాంతో మనస్తాపం చెందిన నిఖిత బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి 10 దాటినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు తలుపు బద్దలుకొట్టి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయి ఉంది.

సిరిసిల్లలో ఉదయ్‌ ఇంటి ముందు ఆందోళన చేస్తున్న నిఖిత బంధువులు

మృతదేహంతో ఆందోళన
సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: వివాహిత ఆత్మహత్యకు కారణమైన భర్తపై చర్యలు తీసుకోవాలంటూ నిఖిత బంధువులు గురువారం సిరిసిల్లలోని మృతురాలి భర్త ఉదయ్‌ ఇంటి ముందు ఆందోళన చేశారు. హైదరాబాద్‌లో మృతి చెందిన ఆమెకు అత్తగారి ఇంటి వద్దనే అంత్యక్రియలు నిర్వహించాలని తీసుకురాగా జిల్లా సరిహద్దు గ్రామం జిల్లెల్లలో పోలీసులు అడ్డుకొని మృతదేహాన్ని తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్‌కు తరలించారని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో మృతదేహాన్ని కస్బెకట్కూర్‌కు తరలించడంతో ఆగ్రహించిన గ్రామస్థులు సిరిసిల్ల పురపాలక సంఘం పరిధి వెంకంపేటలోని ఉదయ్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మృతురాలికి అంత్యక్రియలు అత్తారింట్లో చేస్తారా? మమ్మల్ని చేయమంటారా అని అడగడానికి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఏమిటని బంధువులు ప్రశ్నించారు. మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని