Updated : 29 Jun 2022 05:45 IST

చోదకుడి నిర్లక్ష్యానికి ఇద్దరు విద్యార్థుల బలి

మరొకరి పరిస్థితి విషమం

రంగంపేటలో రోడ్డుపై వెళుతుండగా ఢీకొట్టిన ట్రాక్టర్‌


జశ్వంత్‌, రజనీకాంత్‌

 

కొల్చారం, మెదక్‌ టౌన్‌, మెదక్‌, న్యూస్‌టుడే: ట్రాక్టరు చోదకుడి నిర్లక్ష్యం.. ఇద్దరు విద్యార్థులను బలిగొనగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన మెదక్‌ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మెదక్‌లోని 9వ వార్డు పరిధి గోల్కొండ వీధికి చెందిన శివాయిపల్లి రాజు, పోచమ్మ దంపతులకు కుమారుడు జశ్వంత్‌ (15), కుమార్తె పూజ ఉన్నారు. పట్టణంలోని పదో వార్డు పరిధి నర్సిఖేడ్‌కు చెందిన తుర్పట్ల శంకర్‌దాదా, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు రజనీకాంత్‌ (15), చిన్నోడు దుర్గాప్రసాద్‌, జశ్వంత్‌లు కొల్చారం మండలం రంగంపేట గ్రామంలోని సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఉంటున్నారు. అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జశ్వంత్‌, రజనీకాంత్‌ 9వ తరగతి కాగా, దుర్గాప్రసాద్‌ 7వ తరగతి చదువుకుంటున్నారు. గోల్కొండ వీధికి చెందిన అచ్చంపేట దశరథ్‌, శకుంతల దంపతుల ఏకైక కుమారుడు చరణ్‌ సైతం ఈ నెల 27న సదరు వసతిగృహంలో చేరి.. అదే పాఠశాలలో ప్రవేశం పొందారు. జశ్వంత్‌, రజనీకాంత్‌లు తలనొప్పిగా ఉందని మంగళవారం బడికి వెళ్లలేదు. వీరితో పాటు దుర్గాప్రసాద్‌ వసతిగృహంలో ఉండిపోగా... చరణ్‌ ఒక్కడే పాఠశాలకు వెళ్లాడు.

చరణ్‌ కోసం వెళ్లి... : జశ్వంత్‌, రజనీకాంత్‌ కలిసి చరణ్‌ను తీసుకురావాలని 11.30 గంటలకు పాఠశాలకు వెళ్లారు. ఈక్రమంలో అక్కడి నుంచి ముగ్గురు వసతిగృహానికి బయలుదేరారు. అదే సమయంలో సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం పోసాన్‌పల్లి గ్రామానికి చెందిన శంకరయ్య తన ట్రాక్టరులో పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయానికి కుటుంబీకులతో కలిసి వెళ్తున్నారు. మద్యం దుకాణం సమీపాన అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతున్న శంకరయ్య.. ఒక్కసారిగా రోడ్డు పక్క నుంచి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులపైకి ట్రాక్టర్‌ పోనిచ్చాడు. దీంతో జశ్వంత్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, రజనీకాంత్‌, చరణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకొని 108లో క్షతగాత్రులను మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రజనీకాంత్‌ చనిపోయాడు. చరణ్‌ను మెదక్‌ ఆసుపత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న బాధిత కుటుంబీకులు జశ్వంత్‌ మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌ అక్కడికి వెళ్లి నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. మెదక్‌ గ్రామీణ సీఐ విజయ్‌ అక్కడికి చేరుకొని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని రోదించడం అక్కడున్న వారికి కలిచివేసింది. రజనీకాంత్‌ తండ్రి శంకర్‌దాదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


ఘటన స్థలంలో బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న మెదక్‌ గ్రామీణ సీఐ విజయ్‌

బాధ్యులపై చర్యలకు డిమాండ్‌..

వసతిగృహంలో ఉన్న విద్యార్థులు బయటకు వెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన వార్డెన్‌తో పాటు పాఠశాలకు వెళ్లిన విద్యార్థి.. విశ్రాంతి సమయంలో బయటికి వచ్చినా స్పందించని పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని మృతుల తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్‌ చేశారు. మెదక్‌, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు వచ్చి న్యాయం చేసే వరకు శవ పంచనామా చేయనివ్వమని భీష్మించారు.

అన్ని విధాలా ఆదుకుంటాం..

ఆందోళన సమాచారం అందడంతో మెదక్‌, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌, మెదక్‌ పురపాలిక ఛైర్మన్‌ చంద్రపాల్‌ మంగళవారం రాత్రి మెదక్‌ ప్రభుత్వాసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఆర్థికసాయం అందించడంతోపాటు మెదక్‌లో రెండు పడక గదుల ఇళ్లు.. పొరుగు సేవల కింద ఉద్యోగాలు ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద ఇరు కటుంబాలకు రూ.20 వేలు అందజేశారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు.

చదువుకుంటారని పంపిస్తే విగతజీవులై..

ఇంటి దగ్గర చదవడం లేదని, దూరంగా ఉంటే మంచిగా చదువుకుంటారన్న ఆశతో వసతిగృహానికి పంపిస్తే విగతజీవులుగా తిరిగొచ్చారా అని మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తుంటే వారికి సర్ది చెప్పడం ఎవరి వల్ల కాలేదు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడని, ఇప్పుడు ఎవరిని చూస్తూ బతకాలని జశ్వంత్‌ తల్లి రోదనలతో అక్కడ ఉన్న వారికి కన్నీరు తెప్పించింది. అదే సమయంలో మృతదేహాలను తీసుకురాగా, మెదక్‌ పట్టణంలోని 9, 10 వార్డుల ప్రజలు భారీగా తరలివచ్చారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న మెదక్‌ డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని