కోళ్లను కాపాడేందుకు వెళ్లి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు!

బావిలో పడిపోయిన కోళ్లను బయటకు తీసే యత్నంలో ఓ వ్యక్తి జారి పడడంతో ఇనుప చువ్వలు గుచ్చుకున్న సంఘటన ఇది.

Updated : 29 Jan 2023 03:30 IST

తాడు జారి బావిలో పడటంతో భుజం, వెన్నెముకలోకి గుచ్చుకున్న చువ్వలు

జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: బావిలో పడిపోయిన కోళ్లను బయటకు తీసే యత్నంలో ఓ వ్యక్తి జారి పడడంతో ఇనుప చువ్వలు గుచ్చుకున్న సంఘటన ఇది. భుజం, వెన్నెముక, మూత్రపిండాల భాగంలో అవి దిగడంతో నాలుగు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. చివరకు పోలీసులు క్రేన్లు, వెల్డర్‌ సాయంతో తీవ్రంగా శ్రమించి బాధితుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. జహీరాబాద్‌ గ్రామీణ ఎస్సై పరమేశ్వర్‌, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం అర్జున్‌నాయక్‌ తండా శివారులోని వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే గోవింద్‌నాయక్‌ వద్దకు కోహీర్‌ మండలం సిద్ధాపూర్‌ తండాకు చెందిన ఆయన అల్లుడు రాము రాథోడ్‌ శనివారం భార్యా పిల్లలతో కలిసి వచ్చాడు. వ్యవసాయ బావిలో కోళ్లు పడిపోవడంతో రాము రాథోడ్‌(42) తాడు కట్టుకుని దిగి మొదట వాటిని బుట్టలో వేసి పైకి పంపాడు. తర్వాత అదే తాడు సాయంతో ఆయన పైకి చేరుకుంటుండగా.. జారి కిందకు పడిపోతూ బావి సిమెంటు రింగులకు ఉన్న ఇనుప చువ్వలు గుచ్చుకుని మధ్యలోనే ఇరుక్కుపోయాడు. భుజం, వెన్నెముకలో చువ్వలు లోపలి వరకు దిగిపోవడంతో కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు రెండు క్రేన్లు, ఫైర్‌ ఇంజిన్‌ సాయంతో ఘటనా స్థలానికి వచ్చి రామును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో వెల్డర్‌ను పిలిపించి కోత యంత్రం సాయంతో చువ్వలు కత్తిరించి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అంబులెన్స్‌లో జహీరాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని