Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!

వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులు తమ పిల్లల వద్ద ఉంటూ ఆనందంగా సేదదీరాల్సిన సమయం.

Updated : 31 Mar 2023 08:51 IST

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులు తమ పిల్లల వద్ద ఉంటూ ఆనందంగా సేదదీరాల్సిన సమయం. కుమార్తెలకు పెళ్లిళ్లయి అత్తవారింటికి వెళ్లిపోవటం, కుమారులు బతుకుదెరువు కోసం దూరంగా ఉండటంతో ఇంటి వద్ద ఇద్దరే మిగిలారు. భార్య అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమెకు సపర్యలు చేద్దామంటే భర్తకు చేతకాని పరిస్థితి. ఈ దశలో ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దేవరకద్రకు చెందిన బండ ఆంజనేయులు(65), సత్యమ్మ(58) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్నకుమారుడికి మినహా అందరికీ వివాహాలయ్యాయి. కుమారులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఒకరు వ్యాపారం, మరొకరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆంజనేయులు, సత్యమ్మలు దేవరకద్రలోని ఇంటి వద్దే ఉండేవారు. మూడేళ్ల కిందట సత్యమ్మకు పక్షవాతం రావడంతో  అప్పటి నుంచి ఆంజనేయులే భార్యకు సపర్యలన్నీ చేస్తున్నారు. ఆస్తిపాస్తులు ఉన్నా అవసాన దశలో ఎవరి సహాయం లేకుండా జీవించాల్సి వస్తోందని మనస్తాపానికి గురైన దంపతులు గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం చుట్టుపక్కల వారు ఇంటి తలుపుతట్టగా ఈ విషయం వెలుగుచూసింది. స్థానికులు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై దేవరకద్ర ఎస్సై భగవంతరెడ్డిని ‘ఈనాడు’ సంప్రదించగా తమకు ఫిర్యాదు రాలేదని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని