తెదేపా అభిమాని ఆత్మహత్యాయత్నం

చంపుతామని వైకాపా నేతలు బెదిరిస్తున్నారంటూ ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడుకు చెందిన తెదేపా అభిమాని దండా అవినాష్‌రెడ్డి (20) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Updated : 07 Jun 2023 05:54 IST

వైకాపా నేతల వేధింపులే కారణమని ఆరోపణ

చందర్లపాడు, నందిగామ, న్యూస్‌టుడే: చంపుతామని వైకాపా నేతలు బెదిరిస్తున్నారంటూ ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడుకు చెందిన తెదేపా అభిమాని దండా అవినాష్‌రెడ్డి (20) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబీకులు ఆయన్ని నందిగామకు, అక్కడినుంచి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆత్మహత్యాయత్నానికి ముందు అవినాష్‌రెడ్డి సెల్ఫీ వీడియో చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వీడియోలో పేర్కొన్న వివరాలివి. ‘నేను తెదేపా అభిమానిని. ఇటీవల శ్రీరామనవమి వేడుకల్లో తెదేపా బ్యానర్‌ కట్టా. గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు కొండా కృష్ణారెడ్డి తన అనుచరులను పంపించి తీసేయమనగా తొలగించా. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా బ్యానర్‌ కట్టి పది మందిమి కలిసి వేడుకలు నిర్వహించాం. ఆ కార్యక్రమం నిర్వహించాననే అక్కసుతో నాపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉపాధి పథకం క్షేత్ర సహాయకుడు ముకుందారెడ్డితో పాటు కృష్ణారెడ్డి, చౌడారెడ్డి, గోపీనాయక్‌, సుబ్బయ్య వచ్చి నన్ను, మా బావను కొట్టారు. దానిపై చందర్లపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఎస్సై ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలన్నారు. లేకపోతే నీపై ఎస్టీ కేసు పెడతామని, రౌడీషీట్‌ తెరుస్తామని బెదిరించారు. ఈ నెల 4న రాత్రి చందర్లపాడు వెళ్తుంటే.. ముకుందారెడ్డి ఆపి బెదిరించాడు.  పార్టీలో తిరిగినందుకు నిన్ను చంపినా వెనుక ఎవరూ రారు.. మీ తెదేపా నాయకులు అసలు రారు. మాకు ఎమ్మెల్యే ఉన్నారని బెదిరించాడు. దీనిపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చర్యలు తీసుకోవాలి’ అని వీడియోలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని