Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పిడుగుల వాన

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వీటి కారణంగా శుక్రవారం ముగ్గురు మృతిచెందగా..

Updated : 30 Sep 2023 07:28 IST

ముగ్గురి మృతి, ములుగు జిల్లాలో  మరొకరు మృత్యువాత
ఈదురుగాలులకు విద్యుత్తు తీగ  మీద పడి ఓ యువ రైతు..
వాగులో పడి మరో మహిళ దుర్మరణం

జైనథ్‌, వాంకిడి, మంగపేట, చెన్నూరు, బేల, బోథ్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వీటి కారణంగా శుక్రవారం ముగ్గురు మృతిచెందగా.. ఇతర ఘటనల్లో మరో ఇద్దరు మృతిచెందారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం గూడకు చెందిన యాసిం(38) భార్య అప్సానాతో కలిసి పొలం నుంచి ఇంటికెళ్లేందుకు ఎడ్లబండి కడుతుండగా పిడుగుపడింది. ఈ ఘటనలో యాసిం, జత ఎడ్లు అక్కడికక్కడే మృతిచెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కుమురం భీం జిల్లా వాంకిడి మండలం కెడెగాంకు చెందిన భార్యాభర్తలు గెడాం పద్మ(22), టుల్లి పొలం పనుల్లో ఉండగా వర్షం పడటంతో చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగుపడటంతో పద్మ అక్కడికక్కడే మృతిచెందగా.. భర్త అస్వస్థతకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కౌలు రైతు రావుల రవీందర్‌(28) పత్తి చేనులో కలుపు తీస్తుండగా పిడుగుపడింది. ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు-మొట్లగూడెం పంచాయతీ పరిధి బొమ్మాయిగూడెంకు చెందిన ఈసం పవన్‌కల్యాణ్‌(24) గురువారం రాత్రి తన మొక్కజొన్న పంటకు కాపలాగా వెళ్లారు. భారీ వర్షం పడటంతో ఇంటికి తిరిగెళ్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందారు.

ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం మశాల(బి) పంచాయతీ మోహన్‌రావుగూడకు చెందిన మడావి కుశ్వంత్‌రావు తలయిగూడ సమీపంలోని తన పొలం నుంచి భార్య సంగీతతో కలిసి ఎడ్లబండిపై ఇంటికి వెళ్తుండగా పిడుగుపడింది. ఈ ఘటనలో రైతుకు తీవ్ర గాయాలవగా.. ఒక ఎద్దు చనిపోయింది. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పొచ్చరకు చెందిన యువ రైతు కొమ్ము రాము(27) పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో విద్యుత్తు స్తంభంపై ఉన్న ఇన్సులేటర్‌ విరిగిపోయి తీగలు తెగి ఆయనపై పడటంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఇదే మండలానికి చెందిన బాలాపూర్‌లో ఆలయానికి వెళ్లిన ఏడుగురు గ్రామస్థులు ఎడ్లబండిపై తిరిగొస్తుండగా వర్షానికి ఎడ్లు జారి వాగులో పడ్డాయి. ప్రవాహానికి అంతా కొట్టుకుపోతుండగా గ్రామస్థులు ఆరుగురిని కాపాడారు. బాలాపూర్‌కు చెందిన రావుత్‌ రుక్మిణీబాయి(60) మాత్రం బయటకు రాలేక చనిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని