Crime: ‘మోసగాళ్లు’ తరహాలో నకిలీ కాల్‌ సెంటర్‌.. 12 మంది అరెస్టు!

మంచు విష్ణు, కాజల్‌, నవదీప్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మోసగాళ్లు’ చిత్రం చూశారా! అందులో వీరు ఒక నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, అమెరికన్‌ రెవెన్యూ అధికారులుగా అమెరికన్లకు ఫోన్‌ చేసి ట్యాక్స్‌ కట్టాలని సూచిస్తుంటారు. వారి కట్టే డబ్బును గిఫ్ట్‌కార్డు రూపంలో తీసుకొని నగదుగా మార్చుతూ

Published : 04 Aug 2021 01:41 IST

దిల్లీ: మంచు విష్ణు, కాజల్‌, నవదీప్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మోసగాళ్లు’ చిత్రం చూశారా! అందులో వీరు ఒక నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, అమెరికన్‌ రెవెన్యూ అధికారులుగా అమెరికన్లకు ఫోన్‌ చేసి ట్యాక్స్‌ కట్టాలని సూచిస్తుంటారు. వారు కట్టే డబ్బును గిఫ్ట్‌కార్డు రూపంలో తీసుకొని నగదుగా మార్చుతూ రూ. కోట్లకు పడగలెత్తుతారు. గతంలో జరిగిన ఒక సైబర్‌మోసం ఆధారంగా తెరకెక్కిందే ఈ చిత్రం. అయితే, మళ్లీ అదే తరహాలో దిల్లీలో కొందరు ఓ నకిలీ కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తుండగా.. పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..

నైరుతీ దిల్లీలోని ఓ కాల్‌సెంటర్‌లో ఉద్యోగులు తమకు తాము ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ అమెజాన్‌ టెక్‌ సపోర్ట్‌ స్టాఫ్‌గా పరిచయం చేసుకొని అమెరికా, కెనడాలో ఉండే ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. మొదట అక్కడి ప్రజల్లో కొందర్ని లక్ష్యంగా చేసుకొని వారి అమెజాన్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురైనట్లు లేదా వ్యక్తిగత సమాచారానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపే విధంగా ఒక సమాచారాన్ని పంపిస్తారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కాల్‌ చేయాలంటూ ఒక నంబర్‌ ఇస్తున్నారు. కంగారుపడి కాల్‌ చేసిన వారితో అమెజాన్‌ టెక్‌ సపోర్టు స్టాఫ్‌లా మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించడానికి కొంత మొత్తం ఖర్చు అవుతుందని చెబుతారు. కస్టమర్‌ డబ్బులు చెల్లించడానికి సిద్ధపడితే.. ఆ మొత్తాన్ని గిఫ్ట్‌కార్డు రూపంలో ఇవ్వాలని కోరుతారు. అలా వచ్చిన గిఫ్ట్‌కార్డులను అమెరికా, కెనడాలో ఉన్న వారి మనుషులతో నగదు రూపంలోకి మార్చుకుంటారు. 

గత కొన్నాళ్లుగా ఈ కాల్‌ సెంటర్‌ విదేశీయులను మోసం చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తోంది. ఈ విషయం తెలియడంతో జులై 31న పోలీసులు కాల్‌ సెంటర్‌పై దాడి చేశారు. అక్కడ పనిచేస్తున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 19 కంప్యూటర్లు, 13 మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ రూటర్లు.. సాఫ్ట్‌వేర్‌ ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకి వెల్లడించారు. ఇదే కాదు.. కొన్ని రోజుల కిందట.. మరో నకిలీ కాల్‌సెంటర్‌పై దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు. అమెరికన్‌ అధికారులుగా అక్కడి పౌరులకు కాల్స్‌ చేసి.. వారి సోషల్‌ సెక్యురిటీ నంబర్‌ను రద్దు చేస్తామని చెప్పి రూ. కోట్లు దండుకున్నారు. గత కొంత కాలంగా దిల్లీలో ఇలాంటి నకిలీ కాల్‌సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు వాటిపై దాడులు చేస్తూ వారి గుట్టును రట్టు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని