అంబులెన్స్‌లో వెళ్తూ ఎస్సై ఆత్మహత్య!

దేశ రాజధాని నగరంలో ఓ ఎస్సై ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. సీఏటీఎస్‌ (సెంట్రలైజ్‌డ్‌ యాక్సిడెంట్‌ అండ్‌ ట్రూమా సర్వీసెస్‌) అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్తుండగా  ఉరి వేసుకున్నట్టు సమాచారం. .....

Published : 14 Feb 2021 01:19 IST

మూడు ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు నిరాకరణ

దిల్లీ: దేశ రాజధాని నగరంలో ఓ ఎస్సై ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. సీఏటీఎస్‌ (సెంట్రలైజ్‌డ్‌ యాక్సిడెంట్‌ అండ్‌ ట్రౌమా సర్వీసెస్‌) అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్తుండగా ఉరి వేసుకున్నట్టు సమాచారం. ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజ్‌వీర్‌ సింగ్‌ (39)ను మూడు ఆస్పత్రుల్లో చేర్పించుకొనేందుకు నిరాకరించడంతో చివరకు అదే అంబులెన్స్‌లో ఐహెచ్‌బీఎస్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌వీర్‌ శుక్రవారం అంబులెన్స్‌ను ద్వారకాలోని తన నివాసం వద్దకు పిలిచారు. అయితే, ఆయన్ను చేర్పించుకొనేందుకు మూడు ఆస్పత్రులు నిరాకరించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో సీఏటీఎస్‌ సిబ్బంది ఆయన్ను శాంతింపజేసి ఐహెచ్‌బీఎస్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే ఆత్మహత్య చేసుకున్నట్టు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 

 డీసీపీ ఆర్‌పీ మీనా మాట్లాడుతూ.. ఈ ఘటనపై నిన్న మధ్యాహ్నం 3గంటలకు పోలీసులకు సమాచారం అందిందని చెప్పారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లో వస్త్రంతో ఉరివేసుకున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. గత ఐదు రోజుల నుంచి సెలవులో ఉన్నారన్నారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని, లభ్యమైన ఆధారాలను బట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. రాజ్‌వీర్‌ సింగ్‌ ద్వారకాలోని తన కుటుంబంతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అసలు ఆ ఎస్సై ఏ సమస్యతో ఆస్పత్రికి వెళ్లారు? తొలుత మూడు ఆస్పత్రులకు వెళ్లినా చేర్చుకొనేందుకు అక్కడి వైద్యులు ఎందుకు నిరాకరించారు? ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటనే ప్రశ్నలకు సమాధానాలు విచారణలో తేలే అవకాశం ఉంది.

ఇదీ చదవండి..

తల్లికి భయపడి... అత్యాచార నాటకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని