Telangana News: సింహయాజీ బెయిల్‌ పత్రాలు జారీ.. రేపు విడుదలయ్యే అవకాశం

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీకి బెయిల్‌ పత్రాలు జారీ అయ్యాయి. సింహయాజీ తరఫు న్యాయవాది నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో రూ.6లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరి జామీను సమర్పించారు. 

Updated : 06 Dec 2022 20:58 IST


హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీకి బెయిల్‌ పత్రాలు జారీ అయ్యాయి. ఆయన తరఫు న్యాయవాది నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో రూ.6లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరి జామీను సమర్పించారు. దీంతో కోర్టు బెయిల్‌ పత్రాలు మంజూరు చేసింది. సింహయాజీ తరఫు న్యాయవాది ఈ పత్రాలను బుధవారం చంచల్‌గూడ జైలులో సమర్పించిన తర్వాత జైలు అధికారులు వాటిని పరిశీలించి ఆయన్ను విడుదల చేయనున్నారు. హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన 6రోజుల తర్వాత సింహయాజీ జైలు నుంచి విడుదల కానున్నారు. ఒక్కొక్కరికీ రూ.6క్షల పూచీకత్తుతో పాటు, ఇద్దరు జామీను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పూచీకత్తు, జామీను సమర్పించడంలో ఆలస్యమై సింహయాజీ విడుదల కాలేకపోయారు. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్‌లకు సైతం హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, ఇద్దరిపైనా బంజారాహిల్స్‌ పీఎస్‌లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈకేసులు ఉండటంతో ఇద్దరూ చంచల్‌గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

మొయినాబాద్‌ పోలీసులు జారీ చేసిన మెమోను కొట్టివేసి కోర్టు

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం నమోదు చేసిన కేసులను శాంతిభద్రతల విభాగం పోలీసులు కానీ, సిట్‌ అధికారులు దర్యాప్తు చేసే అధికారం లేదని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు తెలిపింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో మెయినాబాద్‌ పోలీసులు అదనంగా నలుగురు నిందితులను చేరుస్తూ జారీ చేసిన మెమోను ఈ కారణంగా తిరస్కరిస్తున్నట్టు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి నిరోధకశాఖకు మాత్రమే ఈ సెక్షన్‌ కింద నమోదైన కేసును దర్యాప్తు చేసే అధికారం ఉంటుందని కోర్టు తెలిపింది. 

బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, జగ్గు స్వామి, శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ మెయినాబాద్‌ పోలీసులు గత నెల 22న ఏసీబీ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై ఈనెల 2న వాదనలు జరిగాయి. నిందితులు బీఎల్‌ సంతోష్‌తో పాటు తుషార్‌, జగ్గుస్వామితోనూ మంతనాలు జరిపారని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఈమేరకు కొన్ని ఫొటోలను సైతం కోర్టుకు సమర్పించారు. కేవలం ఫొటోలు దిగినంత మాత్రాన రామచంద్రభారతికి, బీఎల్‌ సంతోష్‌కి సంబంధం ఉన్నట్టు కాదని, కేసుతో నలుగురికీ ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం మొయినాబాద్‌ పోలీసులు దాఖలు చేసిన మెమోను కొట్టివేసింది. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసే యోచనలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని