‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. వైద్యుడు జగ్గుస్వామికి సిట్ నోటీసులు

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో కేరళకు చెందిన వైద్యుడు డా.జగ్గుస్వామికి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Published : 18 Nov 2022 11:25 IST

హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో కేరళకు చెందిన వైద్యుడు డా.జగ్గుస్వామికి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కొచ్చిలోని ఓ ఆశ్రమానికి చెందిన వైద్యకళాశాలలో పనిచేస్తున్న జగ్గుస్వామి ఇంటికి సిట్ అధికారులు గత శనివారం వెళ్లారు. అయితే అప్పటికే పోలీసులు వస్తున్న విషయాన్ని ఆయన తెలుసుకొని పరారయ్యాడు. జగ్గుస్వామి ఇంటితో పాటు కార్యాలయంలో సోదాలు చేసిన సిట్ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొచ్చి పోలీసుల సాయంతో జగ్గుస్వామి కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్న సిట్ కార్యాలయంలో 21వ తేదీన హాజరుకావాలని పేర్కొన్నారు. బీడీజెఎస్ అధ్యక్షుడు తుషార్‌కు సైతం సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. 

ఐదు రోజుల పాటు కేరళలో దర్యాప్తు చేసిన సిట్ అధికారులు హైదరాబాద్ తిరిగి వచ్చారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో సిట్ అధికారులు కేరళ వెళ్లి దర్యాప్తు చేశారు. కరీంనగర్ చెందిన న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌కు సైతం సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి, బీడీజెఎస్ అధ్యక్షుడు తుషార్‌కి మధ్యవర్తిగా జగ్గుస్వామి వ్యవహరించినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. జగ్గు స్వామి, తుషార్‌లను ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది. సింహయాజీ స్వామీజీ తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి న్యాయవాది శ్రీనివాస్ టికెట్ బుక్ చేసినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. వీళ్లిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? ఎవరైనా చెబితే టికెట్ బుక్ చేశారా? అనే కోణంలోనూ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని