
Ap News: యువతిపై ప్రేమ వల.. డబ్బు కోసం కిడ్నాప్
రాజమహేంద్రవరం నేరవార్తలు: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై స్నేహంగా చాటింగ్ చేశాడు.. ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు.. లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామని చెప్పి తన కిడ్నాప్ పథకాన్ని అమలు చేశాడు. అసలు విషయం తెలుసుకొని అప్రమత్తమైన యువతి పోలీసుల సాయంతో సురక్షితంగా బయటపడింది. కేసు వివరాలను రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మీడియాకు వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం పూసలమర్రు గ్రామానికి చెందిన ఎం.ఫణీంద్ర చిన్నతనం నుంచే చోరీలకు పాల్పడే వాడు. భీమవరం పరిధిలోని పలు పోలీసు స్టేషన్లలో అతనిపై చోరీ కేసులు నమోదయ్యాయి. ఆరు నెలల కిందట తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలానికి చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థినికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. కొన్ని నెలలు స్నేహంగా చాటింగ్ చేసిన తరువాత యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. ఈ నెల 15న యువతిని ద్విచక్ర వాహనంపై లాంగ్ డ్రైవ్ వెళదామని ఒప్పించాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమెను పథకం ప్రకారం.. ఫణి ద్విచక్ర వాహనంపై తీసుకుని బయలుదేరి కాకినాడ, అమలాపురం, పాలకొల్లు మీదుగా భీమవరం తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ సిద్ధం చేసుకున్న ఓ అపార్ట్‌మెంటు ఫ్లాటులో ఆమెను ఉంచి బయటకు వచ్చి యువతి తండ్రికి ఫోన్ చేసి రూ. 5లక్షలు ఇవ్వకపోతే కుమార్తెను చంపేస్తానని బెదిరించాడు. కంగారు పడిన అతడు.. రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి సీఐ సుభాష్ డీఎస్పీ సంతోష్ నేతృత్వంలో పలు బృందాలు ఏర్పాటుచేసి యువతి కోసం గాలింపు చేపట్టారు.
ఫణి ప్రవర్తపై అనుమానం వచ్చిన యువతి నిలదీసే సరికి కత్తితో ఆమె చేతిపై గాయపరిచి బెదిరించాడు. అతడి వద్ద బంధీగా ఉన్న యువతి 16వ తేదీ మధ్యాహ్నం ఫ్లాటుకు తాళం వేసి ఫణి బయటకు వెళ్లడం గమనించింది. తాళం వేసిన తలుపును లొపలి నుంచి గట్టిగా తట్టడంతో పక్క ఫ్లాటువాళ్లు గమనించారు. తాళం వేసిన ఇంట్లో ఎవరో ఉన్నారని తెలుసుకుని స్థానిక మహిళా పోలీసు ఎన్.నాగ భవానీకి సమాచారం ఇచ్చారు. బాధితురాలి నుంచి విషయం తెలుసుకున్న ఆమె పోలీసులను అప్రమత్తం చేయడంతో అర్బన్ పోలీసులు రంగంలోకి దిగారు. ఫ్లాటుకు తిరిగి వచ్చిన ఫణిని అదుపులోకి తీసుకుని యువతిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో క్రియాశీలక పాత్ర పోషించిన మహిళ పోలీస్ భవానీని ఎస్పీ సత్కరించారు. సీఐ సుభాష్, ఎస్సైలు సుధాకర్, ఎండి జుబెర్, భీమవరం హెడ్ కానిస్టేబుల్ ఎ.శ్రీనివాస్‌ను ఎస్పీ అభినందించారు.