Delhi: దిల్లీ నడిరోడ్డులో బాలికపై దాడి.. సీసీ కెమెరాల్లో నమోదు

దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. బాలికపై ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే తీవ్ర దాడికి పాల్పడ్డాడు......

Updated : 12 Feb 2022 04:29 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. బాలికపై ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే తీవ్ర దాడికి పాల్పడ్డాడు. కర్ర, బూటుతో విచక్షణారహితంగా కొట్టాడు. దీనిపై దిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.

దిల్లీ పశ్చిమ్‌ విహార్‌ ప్రాంతంలో వ్యక్తి ఓ బాలికపై దాడికి పాల్పడుతున్న ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బాలికను దొరకబుచ్చుకున్న సదరు వ్యక్తి.. కర్రతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. విడిపించుకోవాలని బాధితురాలు ఎంత ప్రయత్నించినా ఆమెను వదల్లేదు. అనంతరం కాలికి ఉన్న బూటుతో నిర్దాక్షిణ్యంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనపై స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఏ).. డీసీడబ్ల్యూకి ఫిర్యాదు చేసింది. ఆ సీసీ ఫుటేజీని సైతం అందజేసింది. నిందితుడిని డ్రగ్స్‌ బానిసగా పేర్కొన్న అసోసియేషన్‌.. ఆ అమ్మాయిని కొందరు బంధించినట్లు తెలిపింది. ఆ బాలిక జీవితం ఆపదలో ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ ఘటనపై డీసీడబ్ల్యూ సీరియస్‌గా స్పందించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేయాలంటూ కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు, అరెస్టుకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని స్పష్టం చేశారు. బాలికను రక్షించిన తర్వాత ఆమెకు భద్రత కల్పించాలని కోరారు. ఘటనకు గల కారణాలను తెలుసుకోవాలని, ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను 48 గంటల్లోగా కమిషన్‌కు అందజేయాలని దిల్లీ పోలీసులను హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని